నల్లబెల్లి, జులై 07 : కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న నాలుగు లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తూ ఈ నెల 9వ తేదీన దేశవ్యాప్తంగా చేపట్టిన సమ్మెను జయప్రదం చేయాలని ఏఐఎఫ్టీయూ న్యూ రాష్ట్ర అధ్యక్షుడు మోడెం మల్లేశం పిలుపునిచ్చారు. ఈ మేరకు BRTU, CITU, AITUC, AIFTU (NEW) ల ఆధ్వర్యంలో వ్యవసాయ మార్కెట్ అధికారి, మున్సిపల్ కమిషనర్‌కు సమ్మె నోటీసులు ఇచ్చారు. సమ్మె నోటీసులు ఇచ్చిన వారిలో BRTU రాష్ట్ర నాయకురాలు నల్ల భారతి, జిల్లా అధ్యక్షుడు గోనె యువరాజు, AITUC జిల్లా కార్యదర్శి G. మునీశ్వర్, CITU జిల్లా నాయకులు హన్మకొండ శ్రీధర్, IFTU జిల్లా కార్యదర్శి ఎలకంటి రాజేందర్ ఉన్నారు.
ఈ సందర్భంగా మోడం మల్లేశం మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం కార్పోరేట్ బహుళ జాతి కంపెనీలకు ఉపయోగపడే విధంగా కార్మిక చట్టాలను సవరణ చేసి నాలుగు లేబరు కోడ్లను తీసుకురావడానికి తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈ నెల 9న జరిగే సమ్మెలో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ సంస్థలను కారు చౌకగా ప్రైవేట్ కంపెనీలకు కట్టబెడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పనిని ప్రాథమిక హక్కుగా గుర్తించి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కనీస వేతనం 26 వేలుగా నిర్ణయించాలని డిమాండ్ చేశారు.