ఆడబిడ్డల సంబురం అంబరాన్నంటింది. నెత్తిన బతుకమ్మలు, బోనాలతో ర్యాలీలు.. ఆటపాటల నడుమ మహిళా సంక్షేమ దినోత్సవం వైభవంగా జరిగింది. ఆరోగ్యలక్ష్మి, గృహలక్ష్మి, షీటీమ్స్, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, సఖి, బతుకమ్మ చీరలు, పింఛన్లు, రిజర్వేషన్లు.. ఇలా మరెన్నో విధాల కేసీఆర్ సర్కారు మహిళలకు ‘ప్రత్యేక’ గౌరవం ఇస్తున్న సందర్భాన్ని పురస్కరించుకొని పండుగలా జరుపుకొన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ఉమ్మడి వరంగల్ అంతటా మహిళా సంక్షేమ దినోత్సవ కార్యక్రమాలు భళా అనిపించాయి.
మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్, పంచాయతీరాజ్, గ్రామీణావృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, నన్నపునేని నరేందర్, చల్లా ధర్మారెడ్డి, పెద్ది సుదర్శన్‌రెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, రెడ్యా నాయక్, శంకర్‌నాయక్, రాజయ్య, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, మేయర్ సుధారాణి, కలెక్టర్లు, జడ్పీ అధ్యక్షులు హాజరై ఉత్తమ ఉద్యోగులను సన్మానించారు. మహిళా సంఘాలకు, వివిధ పథకాల లబ్ధిదారులకు చెక్కులు, శిక్షణ పొందిన మహిళలకు కుట్టుమిషన్లు పంపిణీ చేశారు.
– నమస్తే తెలంగాణ నెట్వర్క్