కాశీబుగ్గ, జూన్ 25: వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో మిర్చి ధర భారీగా పెరిగింది. మంగళవారం తేజ రకం మిర్చి రూ. 19,300, వండర్‌హాట్ రకం మిర్చి క్వింటాల్‌కు రూ. 18 వేలు, 341 రకం మిర్చి రూ. 17 వేల ధర పలికింది. సోమవారం తేజ రకం మిర్చి క్వింటాల్‌కు రూ. 18,800, 341 రకానికి రూ. 15,500, వండర్హాట్ను రూ. 17,500లకు వ్యాపారులు కొనుగోలు చేశారు. ధర పెరగడంతో కోల్డ్ స్టోరేజీల్లో మిర్చిని నిల్వ చేసుకున్న రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సీజన్లో అతి తక్కువ ధరకు అమ్ముకోలేక కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేసుకున్నందుకు లాభం వచ్చేలా ఉందని పలువురు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సీజన్ ప్రారంభంలో 341 రకం మిర్చి క్వింటాల్‌కు అత్యధికంగా రూ. 30 వేలు, కనిష్టంగా 12 వేల ధర పలికింది. అలాగే, వండర్‌హాట్ రకం క్వింటాల్‌కు రూ. 27 వేలు, కనిష్టంగా రూ. 10 వేలకు వ్యాపారులు రైతుల నుంచి కొనుగోలు చేశారు. అంతేకాకుండా తేజ రకం మిర్చి క్వింటాల్‌కు రూ. 22 వేలు, కనిష్టంగా రూ. 12 వేల ధరకు అమ్ముడుపోయింది.