సిటీబ్యూరో: అధికారంలోకి రావడానికి అనేక హామీలిచ్చి.. ఇప్పుడు వాటి పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ వెనకడుగు వేయడంపై ఆర్టీసీ కార్మిక లోకం భగ్గుమంది. సీఎం రేవంత్ సర్కార్‌పై సైరన్ మోగించింది. మంగళవారం చలో సెక్రటేరియెట్‌కు సిద్ధమైంది. ఇందిరా పార్క్ నుంచి వేలాది మంది ఆర్టీసీ కార్మికులు సెక్రటేరియెట్‌కు భారీ ర్యాలీ తీయనున్నారు. రేవంత్ సర్కార్ ఆర్టీసీకి చేస్తున్న అన్యాయాన్ని నిలదీస్తూ నిరసన వ్యక్తం చేయడానికి సిద్ధమైనట్లు గ్రేటర్ ఆర్టీసీ నాయకులు తెలిపారు. గ్రేటర్‌లోని 25 డిపోల నుంచి సుమారు 3 వేల మంది కార్మికులు ర్యాలీలో పాల్గొంటారని వివరించారు.
మధ్యాహ్నం 2 గంటల నుంచి ర్యాలీ ప్రారంభమవుతుందని తెలిపారు. మరోవైపు మధ్యాహ్నం విధులు నిర్వర్తించే వాళ్లు డ్యూటీలోనే ఉంటారని, వారంతా నల్లబ్యాడ్జీలు ధరించి నిరసనలో ఉంటారని పేర్కొన్నారు. కాగా, ఆర్టీసీ కార్మికులపై వారం రోజులగా అధికారులు ఒత్తిడి తీసుకొస్తున్నారు. సెక్రటేరియెట్ ముట్టడిని వెనక్కి తీసుకోవాలని బెదిరింపులకు పాల్పడుతున్నట్టు కార్మికులు చెబుతున్నారు. తమ డిమాండ్ల సాధనకు ఎవరినీ లెక్కచేయబోమని కార్మిక సంఘాలు పేర్కొన్నాయి. పోలీసులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ర్యాలీని ఆపలేరని ఆర్టీసీ నాయకులు వివరించారు.