హైదరాబాద్, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వం డెస్క్ జర్నలిస్టులందరికీ అక్రెడిటేషన్ కార్డులు ఇచ్చే వరకూ తమ పోరాటం ఆగదని డీజేఎఫ్టీ స్పష్టం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా డీజేఎఫ్టీ ఆధ్వర్యంలో సోమవారం డెస్క్ జర్నలిస్టులు ఆందోళన బాట పట్టారు. హైదరాబాద్ మాసాబ్‌ట్యాంక్‌లోని ఐఅండ్‌పీఆర్ కమిషనర్ కార్యాలయం ఎదుట చేపట్టిన ధర్నాకు పెద్ద ఎత్తున డెస్క్ జర్నలిస్టులు తరలివచ్చారు. ఈ ఆందోళనకు వివిధ జర్నలిస్ట్స్ సంఘాలు సంఘీభావం ప్రకటించాయి. ఈ సందర్భంగా డీజేఎఫ్టీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జ్యోతిబసు, మస్తాన్ మాట్లాడుతూ సర్క్యులేషన్‌తో సంబంధం లేకుండా ప్రతి జిల్లా డెస్క్‌కు ఐదు కార్డులు ఇవ్వాలని, హైదరాబాద్ సిటీ డెస్క్‌కు 18, సెంట్రల్డెస్క్కు 20, టీవీ చానళ్లకు ప్రస్తుతం ఉన్న 8 కార్డుల సంఖ్యను 15కు పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దరఖాస్తుల ప్రక్రియను సులభతరం చేయాలని, కార్టూనిస్టుల కాలం చేర్చాలని డిమాండ్ చేశారు. అనంతరం ఐఅండ్‌పీఆర్ అధికారి జగన్‌కు వినతిపత్రం అందజేశారు.
పాత విధానంలోనే ఇవ్వాలి: టీయూడబ్ల్యూజే(హెచ్)-143
డెస్క్ జర్నలిస్టులందరికీ పాత విధానంలోనే అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వాలని టీయూడబ్ల్యూజే(హెచ్)-143 నాయకులు డిమాండ్ చేశారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతీసాగర్, రాష్ట్ర కోశాధికారి యోగానంద్, హైదరాబాద్ ఇన్చార్జి నవీన్‌కుమార్ డీజేఎఫ్టీ ఆందోళనలకు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కార్డుల కోసం జర్నలిస్టులు రోడ్లపైకి వచ్చే దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. అర్హులైన జర్నలిస్టులందరికీ న్యాయం జరగాలని, లేకుంటే జర్నలిస్టుల సంఘాలను కలుపుకొని సచివాలయ ముట్టడితో పాటు రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు వెనుకాడబోమని స్పష్టం చేశారు.

వివక్ష తగదు: విరాహత్ అలీ, టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు
అక్రెడిటేషన్ కార్డుల మంజూరు విషయంలో వివక్షపై టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ మండిపడ్డారు. డెస్క్ జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డులు పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అక్రెడిటేషన్ల మంజూరు విషయంలో బయట వ్యక్తుల ప్రమేయంతోనే గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయని తెలిపారు.
డీజేఎఫ్టీ పోరాటానికి మద్దతుగా నిలుస్తాం
డెస్క్ జర్నలిస్టుల పోరాటానికి పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్టు టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజశేఖర్, కార్యదర్శి గండ్ల నవీన్ తెలిపారు. జర్నలిస్టుల అక్రెడిటేషన్ కార్డుల వ్యవహారంపై తక్షణమే ప్రభుత్వం స్పందించాలని హెచ్‌యూజే అధ్యక్షుడు అరుణ్‌కుమార్ డిమాండ్ చేశారు. కార్యక్రమంలో డీజేఎఫ్టీ రాష్ట్ర నాయకురాలు విజయ, కార్యదర్శి దామోదర్, లలిత, నిస్సార్, దొడ్డి శేఖర్, ఓగోలి కిరణ్‌కుమార్, హెచ్‌యూజే కార్యదర్శి జగదీశ్, వినోద్‌రావు, మనీష్, శంకర్, మధుబాబు, భిక్షమయ్య, రమేశ్, సత్యప్రసాద్, రవి, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
వివిధ జిల్లాల్లో డెస్క్ జర్నలిస్టుల ఆందోళన
డెస్క్ జర్నలిస్టులందరికీ అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన నిరసన కార్యక్రమాలు హోరెత్తాయి. కరీంనగర్, నల్లగొండ, మహబూబ్‌నగర్, ఖమ్మం జిల్లా కేంద్రాల్లోని కలెక్టరేట్ల వద్ద డీజేఎఫ్టీ నిరసన కార్యక్రమాలు చేపట్టింది. అనంతరం ఆయా చోట్ల అధికారులకు వినతి పత్రాలు అందజేశారు. డెస్క్ జర్నలిస్టులకు న్యాయం చేసేలా సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని అధికారులను డీజేఎఫ్టీ ప్రతినిధులు డిమాండ్ చేశారు. లేకుంటే ప్రత్యక్ష పోరాటానికి దిగుతామని హెచ్చరించారు.
దరఖాస్తు ప్రక్రియలో సాంకేతిక సమస్యలు పరిష్కరించాలి.. టీయూడబ్ల్యూజే హెచ్-143 ప్రతినిధుల విజ్ఞప్తి
అక్రెడిటేషన్ కార్డుల దరఖాస్తు ప్రక్రియలో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలను పరిష్కరించాలని సమాచార, పౌర సంబంధాల శాఖ అదనపు సంచాలకులు జగన్‌కు టీయూడబ్ల్యూజే హెచ్-143 రాష్ట్ర కార్యదర్శి అస్కాని మారుతీసాగర్, రాష్ట్ర కోశాధికారి యోగానంద్, హైదరాబాద్ ఇన్చార్జి నవీన్ యారా విన్నవించారు. ఆన్లైన్లో దరఖాస్తు సమయంలో ఎదురవుతున్న ఇబ్బందులను లిఖితపూర్వకంగా వారి దృష్టికి తీసుకెళ్లారు.
డాక్యుమెంట్లు డౌన్లోడ్ చేయడానికి సుమారు రెండు గంటల సమయం పడుతున్నదని పేర్కొన్నారు. కొన్నింటికి పీడీఎఫ్, మరికొన్నింటికి జేపీజీ ఫైల్స్ అడగడం వల్ల కన్వర్షన్ ఇబ్బందికరంగా మారిందని తెలిపారు. మీడియా సంస్థల తరఫున ఐఅండ్ పీఆర్‌కు జాబితా చేరిన తర్వాత కూడా జర్నలిస్టులు మళ్లీ ఆన్లైన్ అప్లికేషన్ పంపాలనడంతో సమయం వృథా అవుతున్నదని పేర్కొన్నారు. నకిలీ జర్నలిస్టులను ప్రోత్సహిస్తున్న సంస్థలపై ఐ అండ్ పీఆర్ దృష్టి పెట్టాలని వారు కోరారు.