‘పెట్టుబడి సాయం పెంచి ఇస్తామని కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం ఎకరానికి రూ.15వేలు ఇవ్వాలి, గత కేసీఆర్ సర్కారు ఎలా అయితే అదునుకు ఆసరా అయిందో అదే విధంగా జూన్ మొదటివారంలోనే బ్యాంకు అకౌంట్లో వేయాల’ని మెజార్టీ రైతులు కోరారు. ‘రైతునేస్తం’లో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా ఉమ్మడి జిల్లాలోని 12 రైతు వేదికల్లో ఆయా జిల్లాల కలెక్టర్లు, వ్యవసాయాధికారులు పాల్గొని రైతుల అభిప్రాయాలను సేకరించారు. ఈ సందర్భంగా సాగుభూములన్నిటికీ రైతుభరోసా ఇవ్వాలని కొందరు, పదెకరాల వరకే అమలుచేయాలని, ఐటీ చెల్లించేవారికీ వర్తింపజేయాలని మరికొందరు అభిప్రాయపడ్డారు. ఇక రియల్ ఎస్టేట్ భూములు, బీడు భూములకు, నకిలీ పట్టాపాస్ పుస్తకాలున్న వాటికి పెట్టుబడి సాయం ఇవ్వొద్దని విజ్ఞప్తి చేశారు. అలాగే షరతులు లేకుండా ఒకే దఫాలో త్వరగా రుణమాఫీ చేయాలని కోరగా, సేకరించిన అభిప్రాయాలపై కేబినెట్లో చర్చిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
రైతు భరోసా ఏడాదికి రెండుసార్లు పదెకరాల వరకు వర్తింపజేయాలని రైతులు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా మంగళవారం భూపాలపల్లి జిల్లాలో రేగొండ, కాటారం, ములుగు జిల్లాలో ములుగు, పేరూరు, జనగామ జిల్లాలో గానుగుపహాడ్, చాగల్, మహబూబాబాద్‌లోని ఏటిగడ్డతండా, నర్సింహులపేట, వరంగల్‌లో నర్సంపేట, వర్ధన్నపేట, హనుమకొండలో పలివేల్పుల, పరకాల వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. నర్సంపేటలో 60 మంది రైతుల అభిప్రాయాలను వ్యవసాయ శాఖ అధికారులు రాతపూర్వకంగా తీసుకున్నారు. ప్రతి ఎకరాకు ఏటా జూన్‌లో రూ.7500, నవంబర్, డిసెంబర్లో రూ.7500 చొప్పున అకౌంట్లో వేయాలని రైతులు సూచించారు. నకిలీ పట్టాదారు పాస్‌పుస్తకాలు ఉన్న వారికి డబ్బులు వేయొద్దు. రియల్ ఎస్టేట్ భూములకు రైతుభరోసా డబ్బులు ఇవ్వొద్దు. పదెకరాల భూముల కంటే ఎక్కువ ఉన్న వారికి కూడా పెట్టుబడి సాయం అందించొద్దు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినట్లు రైతు భరోసా సాయం పెంచాలి. రైతులకు ఎలాంటి షరతులు పెట్టొద్దు. కౌలురైతులకు కూడా రైతు భరోసాను ఇవ్వాలి. ఐటీ కడుతున్న వారికి కూడా ఇవ్వాలి. బీడు భూములు, ప్లాట్లకు డబ్బులు ఇవ్వొద్దు. వీటిని గుర్తించి రైతు భరోసా నుంచి తీసేయాలి. తరి, ఖుష్కి భూములకు కూడా ఇవ్వాలని అన్నదాతలు వ్యవసాయ అధికారులకు తమ అభిప్రాయాలు తెలియజేశారు.
హసన్‌పర్తి: రైతులకు పెట్టుబడి సాయం జూన్ మొదటి వారంలోనే ఎకరాకు రూ.15వేలు ఇస్తే మేలు జరుగుతది. సాగులో తీసుకునే జాగ్రత్తలను చెప్పాలె. విత్తనాలు, ఎరువులు, ట్రాక్టర్, వ్యవసాయానికి సంబంధించిన పరికరాలు 50 శాతం సబ్సిడీపై ఇస్తేనే రాబోయే రోజు ల్లో వ్యవసాయం చేయడానికి రైతులు సిద్ధంగా ఉంటరు. లేకపోతే ఎవుసం చేసే పరిస్థితి ఉండదు.
నర్సింహులపేట, జూన్ 25: ఎలాంటి షరతులు లేకుండా ప్రతి రైతుకు రూ. 2 లక్షల రుణామాఫీ చేయాలె. కుటుంబం, రేషన్ కార్డుతో సంబంధం లేకుండా పంట రుణం తీసుకున్న ప్రతి రైతుకూ అందాలె. ప్రస్తుతం చెరువు, బావుల్లో నీళ్లు లేక వరి నారు పోసుకునేందుకు సైతం ఇబ్బందిగా ఉంది. పెట్టుబడి సాయం ఎకరానికి రూ. 15 వేల చొప్పున ఇయ్యాలె. సన్న ధాన్యానికి రూ. 500 బోనస్ అందించాలె. ఉపాధి హామీ పనులను వ్యవసాయానికి అనుసంధానం చేస్తే రైతుకు కొంత మేరకు ఖర్చు తగ్గుతది. వ్యవసాయ పనిముట్లు సబ్సిడీపై అందేలా చూడాలి. కౌలు రైతుకు సైతం రైతు భరోసా ఇవ్వాలె.
నర్సంపేట: రైతు భరోసాను పది గుంటల నుంచి పదెకరాల వరకు భూములు ఉన్న రైతులకు అమలు చేయాలి. ఈ పథకంలో రైతులు ఎంతో లబ్ధి పొందుతున్నారు. ఈ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలి. కొందరు చిన్న రైతులు కూడా ఐటీ కడుతున్నారు. ఎలాంటి షరతులు లేకుండా అమలు చేయాలి. ప్రతి జూన్, నవంబర్, డిసెంబర్ నెలల్లో వ్యవసాయ పనుల ప్రారంభానికి ముందు రైతుల అకౌంట్లలో డబ్బులు వేయాలి. కౌలు రైతులను కూడా గుర్తించి పెట్టుబడి సాయం అందించాలి. లోటుపాట్లను సవరించి ఇవ్వాలి.
నర్సంపేట : రైతు భరోసా పథకాన్ని రైతులకు హామీ ఇచ్చినట్లు అమలు చేయాలి. లొసుగులు లేకుండా సరిచేయాలి. ఖాళీ ప్లాట్లు, ఇళ్ల స్థలాలు, రియల్ ఎస్టేట్ భూములు, ఖాళీ జాగలు, బీడు భూములకు రైతు భరోసా ఇవ్వడం వల్ల డబ్బులు పక్కదారి పడుతున్నాయి. పదెకరాల వరకే రైతు భరోసా ఇవ్వాలి. రైతులకు రుణమాఫీ కూడా ఎంతో అక్కరకు వస్తుంది. రైతులకు రైతు భరోసాను కూడా పెంచి ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఈ డబ్బులను కూడా వానకాలం, యాసంగి పంటల సాగుకు ముందే ఇస్తే మంచిది.
వర్ధన్నపేట: రైతులు ట్రాక్టర్లు, బైక్‌లు కొనుగోలు చేసే సమయంలో కొంతమేర ఐటీ చెల్లింపులు జరుగుతున్నాయి. దీన్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని రైతు భరోసా, రుణమాఫీ వర్తింపజేయకపోవడం సరికాదు. ఇలాంటి విధానాలు అవలంబిస్తే రైతుల నుంచి తప్పకుండా ప్రతిఘటన వస్తది.
రేగొండ, జూన్ 25 : రైతు భరోసా పథకాన్ని ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారులు, రాజకీయ నాయకుకు వర్తింపజేయొద్దు. పదెకరాల లోపు వ్యవసాయదారులకు అమలు చేయాలి. ప్రభుత్వం సర్వే చేసి అసలైన రైతులను గుర్తించాలి. అంతేకాకుండా సాగులో ఉన్న భూములకు మాత్రమే వర్తింపజేయాలి. ప్రభుత్వం, బంజారు, అటవీ, గుట్టలను పరిగణలోకి తీసుకోవద్దు. అలాంటప్పుడే నిజమైన రైతులకు మేలు జరుగుతుంది. అర్హులందరికీ పథకాలు అందుతాయి.
వర్ధన్నపేట : వానకాలం సీజన్ ప్రారంభమైనా ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా ఇయ్యలేదు. గతంలో వానకాలం పంటల సాగుకు ముందే కేసీఆర్ ప్రభుత్వం సాయం అందించింది. పత్తి, ఇతర పంటలకు దుక్కులను చేసుకొని విత్తనాలు కూడా వేసుకున్నం. వరి సాగుకు కూడా సిద్దమైతానం. ఇంతవరకు రైతు భరోసా డబ్బులు అందక ఇబ్బంది పడుతానం. ఇగ ఎప్పుడు ఇత్తరు, ఎట్ల పంటలు సాగు చెయ్యాల్నో ప్రభుత్వానికే తెలువాలె.