నమస్తే తెలంగాణ నెట్వర్క్, జనవరి 2 : పంట పెట్టుబడికి ఇబ్బందుల్లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే ‘రైతుబంధు’ పేరిట నగదు సాయం అందిస్తుండడంతో రైతుల్లో సంతోషం వెల్లివిరుస్తోంది. ఏటా వానకాలం, యాసంగి సీజన్లకు గాను ఎకరాకు రూ.5వేల చొప్పున అందిస్తూ ఆసరా అవుతుండడంతో రైతాంగం ఉత్సాహంగా ముందుకు ‘సాగు’తోంది. ఈ నెల 28 నుంచి ఖాతాల్లో నగదు జమచేసే ప్రక్రియ మొదలుకాగా.. ఐదో రోజైన సోమవారం పలువురు రైతులు బ్యాంకులు, మినీ ఏటీఎంల వద్దకు వెళ్లి డబ్బులు అందుకొని మురిసిపోయారు. ఇదివరకు ఖర్చుకు భయపడి సాగు చేయక పడావు పెట్టే వాళ్లమని.. ఇప్పుడు కేసీఆర్ ఇచ్చిన ఆర్థిక భరోసాతో పంటలు వేస్తున్నామని చెబుతున్నారు.
రైతుల మేలు కోరే సర్కారు..
నాకు మూడెకరాల వ్యవసాయ భూమి ఉంది. అందులో పత్తి, మిర్చి పండిస్తున్నాం. ఇది వరకు రబీ, యాసంగి పంటలు వేసేటప్పుడు పెట్టుబడుల కోసం ఇబ్బంది అయ్యేది. కానీ తెలంగాణ ఏర్పడ్డాక రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు కింద యేడాదికి రెండు సార్లు ఎకరాకు రూ.5వేలు ఇవ్వడం వల్ల ఎంతో ఆసరా అయితున్నడు. ఇప్పుడు మళ్లీ యాసంగి సీజన్ కోసం మళ్లీ రైతుబంధు డబ్బులు ఖాతాల్లో జమ చేశారు. ఆ డబ్బులతో మిర్చి, ఇతర పంటలకు కావాల్సిన ఎరువులు, మందులు కొన్నాం. దీని వల్ల ప్రతిసారి పెట్టుబడుల కోసం వడ్డీ వ్యాపారుల చుట్టూ తిరిగే అవసరం లేకుండా అయింది. అంతేగాకుండా ఉచిత కరంటు, రైతుబీమా లాంటి మంచి పథకాలు పెట్టి రైతుల మేలు కోరుకుంటున్నరు. ప్రస్తుతం పత్తి, మిర్చి, వడ్లకు కూడా మార్కెట్లో మంచి ధర ఉంది.
– మామిడి శివారెడ్డి, ఎల్కతుర్తి,
అదునుకు సాయం అందుతాంది..
పెద్దవంగర : ముఖ్యమంత్రి కేసీఆర్ పొలం పనులకు ఆసరా అయ్యేటందుకు అదునుకు రైతుబంధు ఇచ్చి సాయం జేత్తాండు. అప్పట్ల మాలాంటోళ్లు వ్యవసాయం చేయాలంటే ఖర్చుకు భయపడేది. భూమిని సాగు చేయక పడావు పెట్టేది. కానీ కేసీఆర్ సారు నాకున్న మూడెకరాల భూమికి రైతుబంధు ఇత్తాండు. పండిన పంట కూడా ఊళ్లెనే సర్కారు కొంటాంది. ఇగ ఏ కష్టం లేకుండా జేశిండు. కేసీఆర్ సారు రైతులను అన్నితీర్ల ఆదుకుంటాండు. చాలా ఆనందంగా ఉంది. సర్కారు సాయం మరువలేం.
– జలగం మంజుల, పెద్దవంగర గ్రామం, మహబూబాబాద్ జిల్లా
రైతుబంధుతో రంది తీరింది
వేలేరు : ప్రతి సీజన్‌కు రైతుబంధు పైసలిచ్చి ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల రంది తీర్చుతాండు. రైతులు పంట వేసే ముందు పెట్టుబడికి చేతిలో డబ్బులు లేక చాలా ఇబ్బందులు పడేటోళ్లు. కానీ తెలంగాణ వచ్చినంక కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతుబంధుతో పెట్టుబడికి సాయం అందించడం వల్ల రైతులకు ఇబ్బందులు తప్పినయ్. పంటలు వేసే ముందే రైతులకు డబ్బులు చేతికందుతోంది . రైతుల గోసను తీర్చిన సీఎం కేసీఆర్‌కు రైతులు ఎప్పటికీ రుణపడి ఉంటారు.
– గూటం సాంబయ్య, కమ్మరిపేట, వేలేరు మండలం
పురుగు మందులకు అయినయ్..
మహబూబాబాద్ రూరల్ : సీఎం కేసీఆర్ సకాలంలో రైతుబంధు డబ్బులు ఇవ్వడం వల్ల పురుగు మందులకు ఉపయోగపడ్డయ్. ఈ డబ్బులను యాసంగి పంట పెట్టుబడికే ఖర్చు చేస్తున్నా. కేసీఆర్ సారు వచ్చిన తరువాతనే పట్టా పాసుబుక్ వచ్చింది. అప్పటినుంచి ప్రతి సీజన్‌కు ఠంచన్‌గా రైతుబంధు డబ్బులు బ్యాంక్ ఖాతాలో పడుతున్నయ్. ఇవి పెట్టుబడికి ఎంతో సాయం అవుతున్నయ్. మొన్ననే బ్యాంక్‌కు పోయి డబ్బులు తెచ్చుకున్నా. ఇప్పటికీ ఆరు సార్లు రైతుబంధు తీసుకున్నా. రైతుబంధు లేకముందు చాలా ఇబ్బంది అయ్యేది. రైతు బాంధవుడు, రైతులకు సాయం చేస్తున్న కేసీఆర్ సార్ చల్లగుండాలె.
– బానోత్ నవీన్‌నాయక్, పెద్దరామోజీతండా
ఇదివరకుపెట్టుబడికి అప్పులయ్యేటియి..
భూపాలపల్లి, జనవరి 2 (నమస్తే తెలంగాణ) : ఇతని పేరు రొక్కల మల్లేశ్. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం నాచారం గ్రామం. ఈయనకు మూడెకరాలు అతడి భార్యపై 20 గుంటల వ్యవసాయ భూమి ఉంది. భార్యాభర్తలిద్దరూ వ్యవసాయం చేస్తారు. ఇంతకుముందు పెట్టుబడి కోసం వడ్డీ వ్యాపారుల చుట్టూ తిరిగేది. కొంత మేర అప్పు పుడితే వాటితో విత్తనాలు తెచ్చి పంట వేసేది. మధ్యలో చేనుకు పురుగు పడితే మందు తెద్దామంటే పైసలు ఉండకపోయేది. కూలీనాలీ చేసుకున్న పైసలు కూడా పెట్టుబడికి పెట్టేటోళ్లు. తెలంగాణ వచ్చినంక సీఎం కేసీఆర్ రైతుబంధు కింద పెట్టుబడి సాయం ఎకరానికి ఏటా రూ.10 వేలు రెండు దఫాలు ఇవ్వడంతో నాడు వీరు పడ్డ బాధంతా పోయింది. ఏసిన పంట చేతికి వత్తదనే భరోసా ఇప్పుడు కలిగింది.
– రొక్కల మల్లేశ్, రైతు, నాచారం(మల్హర్),
జయశంకర్ భూపాలపల్లి జిల్లా
మూడెకరాలిచ్చి మమ్ముల్ని రైతులను చేశిండు..
చిన్నగూడూరు : సీఎం కేసీఆర్ అమలుచేస్తున్న రైతు సంక్షేమ పథకాలతో వ్యవసాయం పండుగలా సాగుతోంది. నిరుపేద దళిత కుటుంబానికి చెందిన మాకు మూడెకరాల సాగు భూమి ఇచ్చిండు. రెండు పంటలు మంచిగ పండుతున్నయ్. రెండో పంట సాగు మొదలు పెట్టే సమయానికి రూ.15వేలు రైతుబంధు డబ్బులు వచ్చినయ్. కూలీ చేసుకునే మేము కేసీఆర్ సార్ వల్లే ఇప్పుడు రైతులమైనం. భార్యాభర్తలిద్దరం కలిసి వ్యవసాయం చేసుకుంటూ ముగ్గురు పిల్లల్ని చదివించుకుంటున్నం. ఇదివరకు ఊళ్లల్ల కూలీ దొర్కక పోయేది. చెరువులు, బావుల నిండా పుష్కలంగా నీళ్లు, రోజంతా కరంటు ఉంటాంది. ఇగ కూలీలకు రోజు కూలీ పనులు, రైతుకు చేతినిండా పని దొరుకుతాంది. రైతుల కోసం కేసీఆర్ చేస్తున్న సాయం ఎన్నడూ మరువం.
– కంచనపెల్లి ఎల్లమ్మ, మహిళారైతు, చిన్నగూడూరు
వడ్డీకి తెచ్చే పని లేదు..
కృష్ణకాలనీ : సీఎం కేసీఆర్ సార్ ప్రతి యేడు పెట్టుబడి సాయం అందిస్తున్నడు. పంటలు పండించేందుకు రంది లేకుంట జేశిండు. సీజన్ అచ్చిందంటే షావుకారి దగ్గరకు పోయి వడ్డీకి తెచ్చి ఎవుసం చేసేటోళ్లం. గిప్పుడు పైసల కోసం ఎవ్వలను అడిగే కేసీఆర్ సార్ రైతుబంధు పైసలను డైరెక్ట్ మా బ్యాంకు ఖాతాలనే ఏత్తాండు. అట్ల పైసలు పడంగనే నా ఫోన్‌కు టన్ టన్ అంటూ మెస్సేజీ వచ్చింది. ఎంబడే బ్యాంకుకు పోయి పైసల్ తీసుకున్న. నాకున్న ఒకటిన్నర ఎకరంల మిరప తోట పెట్టిన. రైతుబంధు పైసలతోటి ఎరువులు తెచ్చిన. టైంకు పైసలేసి ఎరువుల రంది తీర్చిన సీఎం కేసీఆర్ సారుకు రుణపడి ఉంటం.
– బొంతల సమ్మయ్య, కాశీంపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా
సాగు పనులకు అక్కెరకు వస్తున్నయ్..
మరిపెడ : వానకాలం, యాసంగి సీజన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుబంధు ద్వారా అందిస్తున్న డబ్బులు పంట పెట్టుబడికి అక్కెరకు వస్తున్నయ్. ఇదివరకు పంట కొనుగోలుదార్ల వద్ద అప్పులు తెచ్చేది. ఇప్పుడా బాధ తప్పింది. అలాగే ఆరుగాలం కష్టించి పండించిన పంటలను ఇంటికి తెచ్చుకొనే పరిస్థితి ఉండేది కాదు. కళ్లాల్లోనే వారికి అప్పగించాల్సి వచ్చేది. సీఎం కేసీఆర్ పాలనలో రైతులకు పంట పెట్టుబడికి సాయం చేయడమే గాక పండించిన పంటలను రవాణాభారం లేకుండా కళ్లాల్లోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం మంచి నిర్ణయం. దీని వల్ల దళారుల బాధ తప్పింది.
– గంట్ల రంగారెడ్డి, మరిపెడ