వరంగల్, జూన్ 27 (నమస్తే తెలంగాణ): సర్కారు నుంచి రైతుబంధు అందుతుండడంతో అన్నదాతల్లో సంతోషం వెల్లివిరిస్తోంది. రెండో రోజు రెండెకరాల విస్తీర్ణం ఉన్న వారికి నగదు జమైంది. జయశంకర్ భూపాలపల్లిలో 46,372మందికి రూ.37.79 కోట్లు, ములుగులో 30,451మందికి రూ.20.14కోట్లు, వరంగల్‌లో 41,613మందికి రూ.30.63 కోట్లు, హనుమకొండలో 46,476మందికి రూ.40.87 కోట్లు వారి ఖాతాల్లో పడ్డాయి. రైతుబాంధవుడిలా వచ్చి పెట్టుబడి కష్టాలు తీర్చి రంది తీర్చారంటూ సీఎం కేసీఆర్‌కు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్నారు. ఈ సందర్భంగా బ్యాంకులకు వెళ్లి నగదు తీసుకొని ఉత్సాహంగా పొలంబాట పడుతున్నారు. వ్యవసాయం కోసం అదునుకు సాయం చేయడంతో పాటు ఎరువులు, విత్తనాలు పుష్కలంగా అందుబాటులో ఉండడంపై సంతోషం వ్యక్తంచేస్తున్నారు.
అప్పు కోసం తిరిగే బాధ తప్పింది
జయశంకర్ భూపాలపల్లి, జూన్ 27 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ వచ్చినంక కేసీఆర్ సారు పుణ్యమా అని రైతుబంధు ఇచ్చి పెట్టుబడి కోసం అప్పు చేసే బాధ తప్పించిండు. రైతుబంధు మాకు అదునుకు ఎంతో అక్కెరకు వత్తాంది. విత్తనాలు, మందు సంచుల(ఎరువులు)ను కొనుక్కుంటున్నం. కేసీఆర్ సారే టైముకు నా బ్యాంకు ఖాతాలో పైసలేత్తాండు. నాకు పావు దక్కువ రెండెకరాలు ఉంది. ఇప్పుడు రూ.8,700 నా బ్యాంకు ఖాతాలో పడ్డయ్. నిన్ననే(మంగళవారం) విడిపించుకున్న. మేము ముదిరాజోళ్లం. కేసీఆర్ సారు మాకు చెరువులల్ల ఉచితంగా చేపపిల్లలను పోత్తాండు. మాకెంతో పని దొరుకుతాంది. మాకు ఒక్కరికనే కాదు, పేదోళ్లందరికీ ఏదో ఒకటి చేసి ఆదుకుంటుండు. సారు వల్ల మాకు మేలే జరుగుతున్నది.
– చిగురు తిరుపతి, రైతు, తాడిచర్ల
బాధలేకుంట చేశిండు
జయశంకర్ భూపాలపల్లి, జూన్ 27 (నమస్తే తెలంగాణ) : పెట్టుబడి పైసల కోసం ఇంతకుముందు ఇంటోళ్లందరం రంది పడేది. ఇప్పుడు కేసీఆర్ సారు వచ్చినంక బాధ లేకుంట చేసిండు. యాసంగి, వానకాలం ఎవుసం మొదలు పెట్టంగనే టక్కిమని రైతుబంధు పైసలు నా బ్యాంకు ఖాతాల్లో పడుతున్నయ్. ఏ సేటు దగ్గరికిపోయి బతిలాడే అవసరం లేకుంట చేశిండు. అప్పుడు పెట్టుబడి కోసం చాలా ఇబ్బంది పడేవాళ్లం, కరెంటు కోతలతో పంటకు సక్కగా అందకపోయేది, టైంకు మందు బత్తాలు దొరుకకపోయేది. తెలంగాణ రాకముందు ఎవుసం చేయాలంటేనే ఏడుపచ్చేది. ఇప్పుడు ఈ బాధలన్నీ సీఎం కేసీఆర్ సారు తీర్చిండు. పెట్టుబడి పైసలు వత్తాన్నయ్, 24గంటల ఉచిత కరెంటు వత్తాంది, ఎప్పుడంటే అప్పుడు ఏ మందు బత్తాలంటే ఆ మందు బత్తాలు దొరుకుతాన్నయ్. నాకు ఎకరం భూమి ఉంది. 5వేలు పడ్డట్టు ఇప్పుడే నాసెల్కు మెసేజు అచ్చింది. తెలంగాణ వచ్చినంక రైతులకు మంచే జరుగుతాంది.
– బోయిని సాంబమూర్తి, భూపాలపల్లి మండలం
రైతులకు ఎంతో మేలు
కేసముద్రం, జూన్ 27 : సీఎం కేసీఆర్ అధికారంలో ఉండడం వల్లనే రైతులకు మేలు అయితాంది. మాకు 1.30 ఎకరాల భూమి ఉంది. వారం కింద పత్తి గింజలు పెట్టిన. మంగళవారం నా సెల్‌కు మెసేజ్ వచ్చింది. ఫోన్ చూడగానే వానకాలం రైతుబంధు డబ్బులు రూ.8750 బ్యాంక్ ఖాతాలో జమ అయినట్లు ఉంది. చాలా సంతోషం వేసింది. ఈ డబ్బులతో ఎరువులు, పురుగు మందులు కొంటా. పంటల పెట్టుబడికి ప్రభుత్వమే ఆర్థిక సాయం చేయడం మూలంగా భారం తగ్గుతుంది. దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ రైతుబంధు, రైతుబీమా పథకాలు పెట్టి రైతులను ఆదుకుంటున్నడు. 24గంటల విద్యుత్ సరఫరా చేస్తూ, పంట ఉత్పత్తులకు మార్కెట్లో ధర లేని సమయంలో ప్రభుత్వరంగ సంస్థల ద్వారా కొనుగోలు చేసి మద్దతు ధర ఇస్తున్నడు. ఆదుకుంటున్న సీఎం కేసీఆర్‌కు రైతులమంతా రుణపడి ఉంటం.
– బండారి నరేశ్, కొత్తూర్
అన్ని సౌలత్లు చేశిండు..
సంగెం, జూన్ 27 : సీఎం కేసీఆర్ సారు మాకు వ్యవసాయం చేసుకునేందుకు పెట్టుబడి కోసం ఎకరానికి ఏడాదికి 10వేలు ఇవ్వడం సంతోషంగా ఉంది. స్వయానా ఆయన రైతు కనుకనే రైతు కష్టాలు తెలుసు. వచ్చిన డబ్బులు దుక్కులు దున్నించి, విత్తనాలు నాటేందుకు అయితయ్. ఎరువులు ఎప్పుడంటే అప్పుడు దొరుకుతున్నయ్ వాటి గురించి భయం లేదు. ఇదివరకు ఎరువుల బస్తాల కోసం పెద్ద లైను కట్టేది. పొద్దునుంచి రాత్రిదాంక నిలబడేది. ఇప్పుడు టైముకు విత్తనాలు తక్కువ ధరకే దొరుకుతున్నయ్. అన్ని సౌలత్లు చేసిన కేసీఆర్ సారుకు రుణపడి ఉంట. సారు సల్లగ ఉండాలె.
– గండ్రకోటి రవి, మొండ్రాయి
పైసలున్నయ్.. నీళ్లున్నయ్..
చెన్నారావుపేట, జూన్ 27 : విత్తనాలు కొనే సమయానికి కేసీఆర్ రైతుబంధు పైసలు ఇచ్చి ఉద్దెర తీసుకునే అవసరం లేకుంట చేసిండు. వానలు పడేనాటికి చేతుల పైసలు లేక విత్తనాలు కొనక ఆలస్యంగా నారుపోస్తే పంటలు పండుతయని నమ్మకం ఉండేది కాదు. కానీ ఇప్పుడు సమయానికి పెట్టుబడి పైసలు వస్తుండడం వల్ల ఎవుసం చేయాలనే హుషారు వస్తాంది. విత్తనాలకు, ఎరువు బస్తాలకు పైసలెట్ల?, అప్పు ఎక్కడ తీసుకరావాలె అనే భయం లేదు. కేసీఆర్ ఇచ్చిన పైసలతో ఊళ్లో ప్రతీ ఒక్కరూ పొలం బాట పటిండ్రు. కాల్వల నిండ నీళ్లు ఉన్నయ్. విత్తనాలు, ఎరువుల కోసం కేసీఆర్ ఇచ్చిన పైసలు ఉన్నయ్. పంట పండించడానికి ఇంకేం కావాలె.?
– నరసింహ, అక్కల్చెడ
సాగుకు ముందే సాయం..
చిట్యాల, జూన్ 27 : రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతుబంధు పథకం కర్షకులకు వరం. ఎకరానికి రూ.5వేల చొప్పున ప్రభుత్వం నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమచేయడం చాలా సంతోషంగా ఉంది. నాకు రెండెకరాల వ్యవసాయ భూమి ఉంది. నా బ్యాంక్ ఖాతాలో రూ.10వేలు జమైనయ్. సాగుకు ముందే పెట్టుబడి సాయం అందించడం వల్ల రైతులంతా మురిసిపోతున్నారు. పత్తి గింజలకు, దుక్కులు పొతం చేయనీకి డబ్బులు ఉపయోగపడనున్నాయి. ఎవరినీ పైసలు బదలు గానీ, అప్పు గానీ అడగాల్సిన పని లేకుండా పోయింది. ఇప్పుడు ఇడిపించుకున్న డబ్బులు ఇంటికి తీసుకెళ్తున్న వెంటనే దుక్కులు దున్నిన కైకిలోల్లకి పైసలు పంచుతా. రైతులకు పెట్టుబడి సాయం, నిరంతర ఉచిత కరెంట్, సాగునీరు అందిస్తున్న సీఎం కేసీఆర్ సార్‌కి ప్రత్యేక కృతజ్ఞతలు.
– యాదండ్ల మహేశ్, నైన్పాక