హనుమకొండ, మే 28: ఉమ్మడి వరంగల్ జిల్లా లో వడ్ల కొనుగోళ్లు సరిగా జరగడం లేదంటూ అధికార పార్టీ ఎమ్మెల్యేలు అసహనం వ్యక్తం చేశారు. క్రయ, విక్రయాలు ఆలస్యమవుతుండడంతో రైతు ల్లో రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతున్నదని అసంతృప్తి వ్యక్తం చేశారు. వరంగల్ ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మరో మంత్రి కొండా సురేఖతో కలిసి ఆరు జిల్లాల్లోని వడ్ల కొనుగోలు, ఇందిరమ్మ ఇండ్లు, భూ భారతి, వానకాలం సాగు, రాష్ట్ర అవతరణ దినోత్సవంపై హనుమకొండ జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షలో తమ ఆవేదనను వెలిబుచ్చారు.
ఎమ్మెల్యేలు గండ్ర సత్యనారాయణరావు, దొంతి మాధవరెడ్డి, నాగరాజు, యశస్వినీరెడ్డి తదితరులు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, మిల్లర్లు దోపిడీ చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘కొనుగోలు కేంద్రాల్లో త్వరగా కాంటాలు పెట్టడం లేదు.. కాంటా అయిన వడ్లకు కేంద్రం నిర్వాహకులు ట్రక్ షీట్లు ఇవ్వడంలేదు. మిల్లర్లు రెండు మూడు రోజుల వరకు లారీల నుంచి లోడు దించుకోవడంలేదు. వానలతో తడిస్తే రైతులదే బాధ్యత అంటున్నరు. తేమ, తాలు ఉన్నదంటూ తూకంలో కోత పెడుతున్నరు. జిల్లా ఉన్నతాధికారులు పట్టించుకోవడంలేదు. ఇప్పుడు ఏ ఊరికి పోయినా రైతులు సర్కారును బూతులు తిడుతున్నరు.
మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వడ్ల కొనుగోలుపై సమీక్షించినప్పటికీ ఎలాంటి మార్పు లేదు. మిల్లర్లు ఇష్టం వచ్చినట్లుగా దోచుకుంటున్నారు’ అంటూ చెప్పుకొచ్చారు. కొనుగోలు కేంద్రంలో ట్రక్‌షీట్ ఇవ్వడం లేదని, లక్ష్మీనర్సింహా రైస్‌మిల్లులో 8రోజులుగా ధాన్యం దింపుకోలేదని, బుధవారం దింపుకొన్నారని, అదికూడా సన్నవడ్లను దొడ్డు వడ్లుగా ఇచ్చి బోనస్ పడకుండా చేశారని, తొమ్మిది రైస్ మిల్లుల యాజమాన్యాలు అవకతవకలకు పాల్పడుతున్నాయని, వాటిపై చర్యలు తీసుకోవాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గం డ్ర సత్యనారాయణరావు మంత్రికి సూచించారు.
ఇంకా మిగిలిన ధాన్యాన్ని వేగవంతంగా కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే యశస్వినీరెడ్డి కోరారు. ఇతర జిల్లాల నుంచి తన నియోజకవర్గంలోని మిల్లులకు ధాన్యం వస్తుందని, దీనిపై విజిలెన్స్ విచారణ జరిపించాలని ఎమ్మెల్యే నాగరాజు అన్నారు. ట్రక్‌షీట్ సమస్య తన నియోజకవర్గంలోనూ ఉందని, రసీదులు ఇవ్వకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, ఈ విషయంలో అధికారులు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నా రు.
తన నియోజకవర్గంలోని కొన్ని గ్రామాల్లో దశాబ్దాలుగా నివాసం ఉం టున్న పేదలకు పొజిషన్ సర్టిఫికెట్లు లేవని, వారి అర్హతలను పరిశీలించి సర్టిఫికెట్లు అందజేయాలని మంత్రికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి సూచించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఇసుక సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలని, సాదా బైనా మా అంశంపై త్వరగా నిర్ణ యం తీసుకోవాలని ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి మంత్రి పొంగులేటి దృష్టికి తీసుకొచ్చారు. కాగా, ఎమ్మెల్యేలు సమస్యలు చెప్పుకుంటూ పోతుండడంతో మంత్రి పొంగులేటి జోక్యం చేసుకుని పలుసార్లు వారించారు. తర్వాత మాట్లాడుదామని సముదాయించారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం అమ లు తీరు బాగా లేదని, ఇప్పటికీ ఒక్క ఇల్లు నిర్మాణానికి ప్రొసీడీంగ్ ఇవ్వలేదని ఎమ్మెల్యే సత్యనారాయణరావు చెప్పారు.
ఒక్క ప్రొసీడింగ్ ఇవ్వరా?
అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వకపోవడం బాధాకరమని, తాను సంతకాలు చేసినా ప్రొసీడింగ్స్ పంపిణీ చేయకపోవడం ఏమిటని మంత్రి పొంగులేటి ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్లు పనితీరు మార్చుకోవాలని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. నకిలీ విత్తనాలు, ఎరువుల విషయంలో కలెక్టర్లు, పోలీసు, వ్యవసాయ అధికారులు సమన్వయంతో పనిచేసి ఉకుపాదం మోపాలని, పీడీ యాక్టు నమోదు చేయాలన్నారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధ్దిదారుల ఎంపిక, ప్రొసీడింగ్స్ అందజేతపై మం త్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఫైరయ్యారు. తాను లిస్ట్‌పై సంతకాలు చేసి ఇచ్చింది కలెక్టరేట్లో ప్రేమ్ కట్టించుకొమ్మని కాదని.. ఇది మంచి పద్ధతి కాదన్నారు. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో కలెక్టర్లు ఎందు కు జాప్యం చేస్తున్నారో అర్థం కావడం లేదని అన్నా రు.
జూన్ 6లోపు లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేసి ప్రొసీడింగ్స్ ఇవ్వాలని ఆదేశించారు. లబ్ధిదారుల ఎంపికలో వయో పరిమితి లేదన్నారు. స్థానిక ప్ర జాప్రతినిధులతో కలిసి కలెక్టర్లు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు ఇసుక ఇబ్బందులు రాకుండా చర్య లు తీసుకోవాలన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ధాన్యం కొనుగోలు విషయంలో చెప్పిన సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ విప్ రామచంద్రూ నాయక్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధా న్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పా టు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.
సమావేశంలో వరంగల్ ఎంపీ కడియం కావ్య, నగర మేయర్ గుండు సుధారాణి, కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, కార్పొరేటర్ మానస, హనుమకొండ, వరంగల్ జనగామ, ములుగు, మహబూబాబాద్, భూపాలపల్లి కలెక్టర్లు పీ ప్రావీణ్య, సత్యశారద, రిజ్వాన్ బాషా షేక్, టీఎస్ దివాకర, అద్వైత్‌కుమార్‌సింగ్, రాహు ల్ శర్మ, ఎస్పీలు, బల్దియా కమిషనర్, అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలు, అధికారులు పాల్గొన్నారు.