హనుమకొండ చౌరస్తా, జూన్ 23: చారిత్రాత్మక రుద్రేశ్వరస్వామి వేయిస్తంభాల దేవాలయంలో 6 సంవత్సరాల తర్వాత శివప్రీతికరమైన సోమవారం రోజున మాసశివరాత్రి కలిసి రావడంతో భక్తులు దేవాలయాన్ని సందర్శించి సామూహిక రుద్రాభిషేకాలు నిర్వహించుకున్నారు. ఉదయం ఉతిష్ట గణపతికి పూజ రుద్రేశ్వరస్వామికి మహాన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకాలు అనంతరం ఆలయ నాట్యమండపంలో ఆది దంపతులైన రుద్రేశ్వరి-రుద్రేశ్వరస్వామి కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు.
ముందుగా స్వస్తివాచకం మంటపారాధన కలశ స్థాపన రుద్రేశ్వరి-రుద్రేశ్వర స్వామివార్లకు భాషికధారణ అనంతరం కల్యాణ క్రతువును నిర్వహించినట్లు, భక్తులందరికీ కళ్యాణోత్సవం తలంబ్రాలను అందజేసినట్లు ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ తెలిపారు. కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి డి.అనిల్ కుమార్, అర్చకులు మణికంఠశర్మ, సందీప్‌శర్మ, ప్రణవ్ పాల్గొన్నారు. శంఖానాదంతో డమరుక వాయిద్యాలతో స్వామివారి కల్యాణం భక్తుల కోలాహాల మధ్య నిర్వహించారు.