Warangal | హనుమకొండ చౌరస్తా, ఏప్రిల్ 26 : చారిత్రాత్మక రుద్రేశ్వరస్వామి వేయిస్తంభాల దేవాలయంలో శనిత్రయోదశి మాసశివరాత్రిని పురస్కరించుకొని ఉత్తిష్ఠ గణపతి ఆరాధన రుద్రేశ్వరస్వామికి ఏకాదశి రుద్రాభిషేకం, సామూహిక రుద్రాభిషేకములు నిర్వర్తించినట్లు ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ తెలిపారు. అనంతరం ఆలయ నాట్యమండపంలో ఉత్సవ శనీశ్వరమూర్తికి తిలతైలాభిషేకాలు శనిదోష నివారణకై భక్తులు తైలాభిషేకం నిర్వర్తించుకున్నారు. ఈ సందర్భంగా రుద్రేశ్వరస్వామికి ఆగామనుసారంగా స్వామివారి మాసకల్యాణోత్సవం వైభవంగా నిర్వర్తించారు.
కంకణధారణ, జీలకర్ర బెల్లం పాదప్రక్షాళన వరప్రవరములతో మహాసంకల్పంతో లగ్నాష్టకములతో మంగళగౌరీ పూజనిర్వర్తించి మంగళ సూత్రధారణ తలంబ్రాలు షోడశోపచార పూజలు నీరాజన మంత్రపుష్పములు 2021లో మే నెలలో శనిత్రయోదశి మాసశివరాత్రి కలిసి రావడం జరిగిందన్నారు. మళ్లీ నాలుగు సంవత్సరాల తర్వాత ఈరోజు మాసశివరాత్రి శనిత్రయోదశి కలిసి రావడం వలన భక్తులు విశేషంగా భావించి తమ దోషాలు తొలగిపోవాలని శనిపూజలు శివపూజలు నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో వైదిక బృందం గంగు మణికంఠ శర్మ, ప్రణయ్ శర్మ, సందీప్ శర్మ పాల్గొని పూజలు నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి డి.అనిల్‌కుమార్ ఏర్పాట్లు పర్యవేక్షించారు.