వరంగల్, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ) : మేడారం సమ్మక్క – సారలమ్మ మహాజాతరకు వెళ్లే భక్తుల కోసం వరంగల్, నర్సంపేట నుంచి ఆర్టీసీ స్పెషల్ బస్సులు నడుపుతున్నారు. వరంగల్ నుంచి 390, నర్సంపేట నుంచి 222 బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ అధికారులు ప్రకటించారు. హనుమకొండ బస్ డిపో ఆధ్వర్యంలో వరంగల్ లక్ష్మీపురంలోని పండ్ల మార్కెట్లో తాత్కాలిక బస్‌స్టేషన్ ఏర్పాటు చేశారు. ఇక్కడ ఐదు కౌంటర్లు, క్యూలైన్లను ఏర్పాటు చేశారు. ఈ బస్‌స్టేషన్‌ను వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఆదివారం ప్రారంభించగా, అదేరోజు నుంచి ఇక్కడి నుంచి మేడారానికి బస్సులు నడుపుతున్నారు. బుధవారం జాతర ప్రారంభం కానున్నందున మంగళ వారం నుంచి ఆర్టీసీ బస్సుల సంఖ్య పెంచారు. వరంగల్ నుంచి మేడారం వరకు బస్ చార్జీలను పెద్దలకు రూ.200, పిల్లలకు రూ.110 నిర్ణయించారు. రోజూ 390 బస్సుల ద్వారా సుమారు 15వేల మందిని మేడారం తరలించను న్నట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. మంగళవారం ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మునిశేఖర్ హనుమకొండ బస్ డిపో మేనేజర్ మోహన్‌రావుతో కలిసి తాత్కాలిక బస్‌స్టేషన్‌లో ఏర్పాట్లను పరిశీలించారు. ఈడీ మునిశేఖర్ మీడియాతో మాట్లాడుతూ గతంలో ఇక్కడ నాలుగు కౌంటర్లు ఏర్పాటు చేయగా ఈసారి ఐదుకు పెంచినట్లు చెప్పారు. వరంగల్ నుంచి మేడారానికి 20వ తేదీ వరకు స్పెషల్ బస్సులు నడుపుతామని హనుమకొండ బస్ డిపో మేనేజర్ మోహన్‌రావు చెప్పారు.
నర్సంపేట నుంచి మేడారం వరకు 222 బస్సులను నడుపుతున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఇక్కడి బస్‌స్టేషన్ ఆవరణలో మేడారం వెళ్లే భక్తుల కోసం ప్రత్యేకంగా రెండు కౌంటర్లు ఏర్పాటు చేశారు. నెక్కొండ, చెన్నారావుపేట, ఖానాపురం, నల్లబెల్లి, దుగ్గొండి మండలాల నుంచి నర్సంపేటకు చేరుకుని ప్రత్యేక బస్సుల్లో బయల్దేరుతున్నారు.