కాశీబుగ్గ, ఫిబ్రవరి 17: వరంగల్‌లోని లక్ష్మీపురం పండ్ల మార్కెట్లో ఏర్పాటు చేసిన బస్సు పాయింట్ నుంచి ఐదు రోజుల్లో 650 బస్సు ట్రిప్పుల ద్వారా 30 వేల మంది భక్తులను ప్రయాణికులను మేడారం జాతరకు చేరవేసినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు 24 గంటలూ అందుబాటులో ఉంటున్నట్లు పేర్కొన్నారు. బారికేడ్లు, చలువ పందిళ్లు, టెంట్లు ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. తాగునీటి సదుపాయం కల్పించామన్నారు. ఆర్టీసీ డ్రైవర్లు, కండక్లర్లు, పోలీసు సిబ్బంది నిత్యం మెరుగైన సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా భక్తులు పాయింట్‌కు చేరుకున్న వెంటనే బస్సు ఎక్కేలా ప్రత్యేకంగా ఐదు కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఆర్టీసీ డీవీఎం అపర్ణ కల్యాణి, జ్యోత్న్స, కస్తూరి శ్రీనివాస్, యాకూబ్‌పాషా, శివ, సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు.
మేడారం వెళ్లే భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు తాము పర్యవేక్షిస్తున్నట్లు సెంట్రల్ డీసీపీ పుష్ప తెలిపారు. గురువారం ఆమె పండ్ల మార్కెట్లోని మేడారం బస్సు పాయింట్‌ను పరిశీలించారు. భక్తులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం భక్తులకు డీసీపీ మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. మేడారం జాతరకు వెళ్లే వారికి ఇబ్బందులు కలుగకుండా చూడాలని కోరారు. ఆమె వెంట ఏసీపీ కలకోట గిరికుమార్, ఇంతేజార్గంజ్ సీఐ మల్లేశ్‌యాదవ్, ఎస్సైలు ఉన్నారు. బస్సు పాయింట్ వద్ద పాతబీటుబజార్లోని కొందరు వ్యాపారులు భక్తులకు ఆహారం, మినరల్ వాటర్ పంపిణీ చేశారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే నాలుగు రోజులపాటు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వ్యాపారులు తెలిపారు. రోజుకు 15 వందల మందికి పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో నిర్వాహకులు మున్నా బహటి, రాజేశ్ బజాజ్, రాజేశ్ గోడియా, హరిమన్యాయర్, నిఖిల్ బజాజ్, కమల్ గోడియా పాల్గొన్నారు.
నర్సంపేట: దారులన్నీ మేడారం వైపే వెళ్తున్నాయి. నర్సంపేట నుంచి మేడారానికి ఆర్టీసీ బస్సులు నిరంతరాయంగా నడుస్తున్నాయి. బుధవారం సారలమ్మ గద్దెకు వచ్చిన తర్వాత మేడారానికి వెళ్లే భక్తుల సంఖ్య పెరుతున్నది. గురువారం సమ్మక్క గద్దెకు రావడంతో పెద్ద ఎత్తున తరలివెళ్తున్నారు. భక్తులకు అసౌకర్యాలు కలుగకుండా ఆర్టీసీ పకడ్బందీ చర్యలు చేపట్టింది. పట్టణంలోని రోడ్లనీ భక్తులతో సందడిగా మారాయి.