సుబేదారి, నవంబర్16: ఐదుగురు యువకులు మద్యం తాగి, ఇద్దరు ఆర్టీసీ అద్దె బస్ డ్రైవర్లు, క్లీనర్‌ను కొట్టిన ఘటన శుక్రవారం రాత్రి జరిగింది. బాధితుడు ఆర్టీసీ అద్దె బస్ డ్రైవర్ బుర్ర హరి కథనం ప్రకారం.. ఐదుగురు వ్యక్తులు ఆటో,రెండు బైక్‌లపై బాలసముద్రం కుడా మైదానానికి శుక్రవారం రాత్రి పదిగంటలకు వచ్చి మద్యం తాగారు. పార్కింగ్ చేసిన ఆర్టీసీ అద్దె బస్సుపై మూత్ర విసర్జన చేస్తుండగా, ఇందేదని అడిగినందుకు ‘అరేయ్ మేం కాంగ్రెస్ ఎమ్మెల్యే మనుషులం, మమ్ములనే అడుగుతార్రా’..అంటూ బూతులు తిడుతూ, తీవ్రంగా కొట్టారు.
100 కాల్ చేయగా సుబేదారి పోలీసులు ఇరువర్గాలకు పోలీసు స్టేషన్‌కు తీసుకువెళ్లారు. ఇరువర్గాలకు డ్రంక్ టెస్ట్ చేయగా మాపై దాడిచేసిన ఐదుగురికి 500పైగా మద్యం తాగినట్లు తేలింది. కొద్దిసేపటికి పోలీసులు వదిలిపెట్టారు. అదే రాత్రి ఆటోలో మళ్లీ ఐదుగురు బాలసముద్రం కుడా మైదానం బస్సుల వద్దకు వచ్చారు. మాపై పోలీసులకు ఫిర్యాదు చేస్తారా అంటూ..ఆర్టీసీ అద్దె బస్ డ్రైవర్ మోహినొద్దీన్‌ను తీవ్రంగా కొట్టి పరారయ్యారని బాధితుడు హరి, డ్రైవర్లు తెలిపారు. మాకు ఇక్కడ రాత్రి సమయంలో ప్రాణభయం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
దాడి చే సిన వ్యక్తులపై చర్యలు తీసుకోవడంలో సుబేదారి పోలీసులు వెనుకడుగు వేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికార పార్టీ ఎమ్మెల్యే పేరు చెప్పి తమపై దాడి చేశారని బాధిత డ్రైవర్లు చెబుతున్నారు. పీఎస్‌లో ఫిర్యాదు చేసి రెండు రోజులైనా దాడి చేసిన వారి పట్టుకోలేదని, ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఏమిటని బాధితులు స్థానిక పోలీసులను ప్రశ్నిస్తున్నారు. కుడాకు నెలకు రూ. 75 వేలు చెల్లించి మైదానంలో మా బస్సులు పార్కింగ్ చేసుకుంటున్నాం. ఇక్కడ మాకు రక్షణ లేకుండా పోయిందని వాపోతున్నారు.
బాలసముద్రం కుడా మైదానం మద్యం బాబులకు అడ్డాగా మారింది. రాత్రి వేళ నిత్యం ఆటోలు, బైక్‌లపై గ్రూపులుగా వచ్చి మద్యం తాగారు. ఎవరైనా ప్రశ్నిస్తే దాడులకు తెగబడుతున్నారు. సుబేదారి పోలీసులు రాత్రి వేళ పెట్రోలింగ్ చేయకపోవడంతో మందు బాబులు రెచ్చిపోతున్నారు, అసాంఘిక కార్యకలాపాలను భరించలేకపోతున్నామని సమీప అంబేద్కర్‌నగర్ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.