హనుమకొండ చౌరస్తా : కాకతీయ యూనివర్సిటీ ( Kakatiya University ) కి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ( Revanth reddy ) రావాలని కేయూ తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమకారులు డిమాండ్ చేశారు. శనివారం కేయూ గెస్ట్‌హౌజ్‌లో నిర్వహించిన సమావేశంలో జాక్ నాయకులు మంద వీరస్వామి, వలాఉల్లాఖాద్రీ మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎన్నో త్యాగాలు చేసిన విద్యార్థులు, ఉద్యమకారుల చారిత్రక కేంద్రంగా కాకతీయ విశ్వవిద్యాలయం నిలిచిందని పేర్కొన్నారు. 2009 తెలంగాణ ఉద్యమంలో కాకతీయ విశ్వవిద్యాలయం కీలకపాత్ర పోషించిందని గుర్తుచేశారు.
ముఖ్యమంత్రి కాకతీయ విశ్వవిద్యాలయాన్ని సందర్శించి, విద్యార్థులు, అధ్యాపకులు, ఉద్యోగులు ఉద్యమకారులను ఉద్దేశించి ప్రసంగించాలని కోరారు. విశ్వవిద్యాలయ అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతులు, పరిశోధనా కేంద్రాలు, విద్యాప్రమాణాల మెరుగుదలకు ప్రభుత్వ సహకారం అందించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణలోనే రెండో విద్యాకేంద్రంగా నిలిచిన కాకతీయ యూనివర్సిటీకి మొండిచేయి చూపకుండా కేయూకు వెంటనే రూ.500 కోట్లు మంజూరు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో నాయకులు సూత్రపు అనిల్, సురాసి కృష్ణ, శ్రీనివాస్ నాయక్, మధు, రాజేందర్, చందు, తదితరులు పాల్గొన్నారు.