వరంగల్, అక్టోబర్ 21 : చార్రితక వరంగల్ నగరాన్ని టెంపుల్ సిటీగా అభివృద్ధి చేస్తామని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. భద్రకాళి ఆలయం చుట్టూ మాడ వీధుల నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.30 కోట్లు విడుదల చేసింది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఆయన గ్రేటర్ కమిషనర్ ప్రావీణ్య, దేవాదాయ శాఖ ఉన్నతాధికారులతో కలిసి స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన ఆలయ అర్చకులు, దేవాదాయ అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో చీఫ్‌విప్ మాట్లాడుతూ మాడ వీధుల నిర్మాణానికి రూ.30కోట్ల నిధుల కోసం కృషి చేసిన రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీలు, నగర ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. టెంపుల్ సిటీ ఆలోచనతో నగర అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. రెండు వేల సంవత్సరాల చరిత్ర కలిగిన నగరంలో అనేక చారిత్రక దేవాలయాలు, జైన మతానికి చెందిన ఆగ్గలయ్య గుట్ట, పర్యాటక ప్రాంతాలు ఉన్నాయని వెల్లడించారు. నగరాన్ని ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు పోతున్నామని వివరించారు. ఇప్పటికే భద్రకాళి చెరువును భద్రకాళి బయోడైవర్సిటీ కల్చరల్ పార్కుగా అభివృద్ధి చేశామని చెప్పారు. రూ.50 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా బండ్‌ను అభివృద్ధి చేశామని పేర్కొన్నారు. భద్రకాళి బండ్ అభివృద్ధితో నగరంలో ఎకో టూరిజం పెరిగిందని తెలిపారు. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో నగరంలోని పార్కులను అభివృద్ధి చేస్తామని అన్నారు. ఇప్పటికే ఎడ్యుకేషన్, హెల్త్, కల్చరల్ హబ్‌గా అభివృద్ధి చెందుతున్న నగరాన్ని ఆధ్యాత్మిక హబ్‌గా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. త్వరలోనే అర్చకులు, వాస్తు నిపుణుల సలహాలతో, నిట్ ప్రొఫెసర్ల సాంకేతిక పరిజ్ఞానం, పోలీసు, గ్రేటర్, అధికారుల సహకారంతో కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మాడవీధుల నిర్మాణం చేపడుతామని చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ చెప్పారు.
భద్రకాళి ఆలయానికి మాడ వీధులతో పాటు 9 అంతస్తుల రాజగోపురం నిర్మించనున్నట్లు చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ తెలిపారు. రాజగోపురానికి సంబంధించిన డిజైన్‌ను ఆయన విడుదల చేశారు. వరంగల్ ప్రజల కొంగుబంగారమైన భద్రకాళి అమ్మవారి దేవాలయం చుట్టూ మాడ వీధులు, 9 అంతస్తుల రాజగోపురం నిర్మాణంతో ఆలయ కీర్తి విశ్వవ్యాప్తం కానుందని అన్నారు. సమావేశంలో కార్పొరేటర్లు దేవరకొండ విజయలక్ష్మి, బొంగు సురేందర్, ఆర్డీవో వాసుచంద్ర, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సునీత, ఆలయ ఈవో శేషుభారతి, ప్రధాన అర్చకుడు శేషు, ‘కుడా’ ఈఈ భీంరావు పాల్గొన్నారు.
హనుమకొండ : చారిత్రక భద్రకాళి దేవాలయ మాడ వీధుల నిర్మాణానికి ప్రణాళిక రూపొందించాలని చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాసర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ రాజీవ్ గాంధీహన్మంతు, గ్రేటర్ కమిషనర్ ప్రావీణ్యతో కలిసి శుక్రవారం మాడ వీధుల నిర్మాణం పై సమీక్షించారు. ఈ సందర్భంగా చీఫ్ విప్ మాట్లాడుతూ అమ్మవారి మాడ వీధుల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.30 కోట్లు కేటాయించిందన్నారు. ఎస్డీఎఫ్ (స్పెషల్ డెవలప్ మెంట్ ఫండ్ ) కింద రూ. 20 కోట్లు, కుడా కింద రూ.10 కోట్లు ఖర్చు చేస్తుందన్నారు. ఉత్సవాల సమయంలో అమ్మవారి ఊరేగింపు చేయడం ఇబ్బందిగా ఉండడంతో దేవాలయం చుట్టూ మాడ వీధులు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు. మాడ వీధుల నిర్మాణానికి అవసరమైన సాంకేతిక సహకారం నిట్ ప్రొఫెసర్లు అందిస్తారని తెలిపారు. రాజగోపురం, మాడ వీధుల నిర్మాణానికి సంబంధించిన భూ సార పరీక్షలు, ఎత్తు పరీక్షలు నిర్వహించాలని సూచించా రు. రాజగోపురాన్ని ప్రఖ్యాత స్థపతులతో నిర్మించాలని అన్నారు. అమ్మ వారి పాదాల కింద ఉండే విధంగా మాడవీధుల నిర్మాణలు చేపట్టాలని సూచించారు. వచ్చే దసరా నాటికి మాడ వీధులు అందుబాటులో తేవాలని, ప్రతి వారం మాడ వీధుల నిర్మాణంపై సమీక్ష ఉంటుందని స్పష్టం చేశారు. చారిత్రక దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తోందని వివరించారు.
దేవాలయంలో ఇక ప్రతి ఏటా ఉత్సవాలు మాడవీధుల్లో జరుగుతాయని చెప్పారు. ఆలయం పకన గల బయోడైవర్సిటీ పారు ఏర్పాటుతో ఎకో టూరిజం పెరిగిందని అన్నారు. సుమారు రూ.50 కోట్ల వ్యయంతో భద్రకాళి బండ్‌ను అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా నిర్మించినట్లు వివరించారు. పిలిగ్రిమేజ్ టూరిజంలో భాగంగా నగరంలో అనేక చారిత్రక ప్రాంతాలు ఉన్నాయని చెప్పారు. నగరం హెల్త్, ఎడ్యుకేషన్, కల్చరల్ హబ్‌గా తీర్చిదిద్దుతున్న ప్రస్తుత తరుణంలో టూరిజం హబ్‌గా మార్చడానికి అన్ని రకాలుగా సహకారం అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్వో వాసుచంద్ర, ఆలయ ప్రధాన అర్చకుడు భద్రకాళి శేషు, సీపీవో సత్యనారాయణరెడ్డి, ఈవో శేషుభారతి, సహాయ కమిషనర్ సునీత, ఎండోమెంట్ డీఈ రమేశ్‌బాబు, నిట్ ప్రొఫెసర్లు కామేశ్వర్రావు, రమణమూర్తి, సూపరింటెండెంట్ విజయ్‌కుమార్, కుడా ఈఈ భీంరావు, ఆర్అండ్బీ ఈఈ రాజం, మాడవీధుల డిజైనర్ ధృమాతరు కంపెనీ కన్సల్టెంట్ రాజ్‌కుమార్ పాల్గొన్నారు.