గోవిందరావుపేట, జూలై 9 : నలభై ఏళ్ల స్వప్నం సాకారమైంది. ఫ్రూట్ఫారమ్ గిరిజన గూడేనికి వెళ్లేందుకు రూ. 1.80 కోట్లతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణం పూర్తయ్యింది. నిధులు మంజూరు చేసిన గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం చల్వాయి గ్రామ పంచాయతీ పరిధిలోని ఫ్రూట్ ఫారమ్ గ్రామానికి వెళ్లేందుకు రోడ్డు సౌక ర్యం లేదు. ఈ విషయమై గత కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాల హయాంలో మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు అప్పటి ఐటీడీఏ అధికారుల చుట్టూ తిరిగినా లాభం లేకుండా పోయింది. ఏటా వానకాలం వస్తే ఆ గ్రామానికి ఇతర ప్రాంతాలతో సంబంధాలు ఉండేవి కావు. దయ్యాలవాగు ఉప్పొంగితే రహదారిపై గండ్లు పడి మరిం త ఇబ్బందిగా ఉండేది. నలభై ఏళ్లుగా వారు ఈ బాధలను అనుభవిస్తూనే ఉన్నారు. ఈ క్రమం లో చల్వాయి సర్పంచ్‌గా ఉన్న ఈసం సమ్మయ్య దివంగత జడ్పీ మాజీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్ దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. గత మంత్రి సత్యవతిరాథోడ్‌ను సైతం గ్రామానికి తీసుకెళ్లి రోడ్డు సమస్యను పరిష్కరించాలని కోరారు. దీంతో సత్యవతిరాథోడ్ ఐటీడీఏకు లేఖ రాయడంతో ట్రైబల్ సబ్‌ప్లాన్, ఇన్ఫాస్ట్రక్చర్ నిధుల నుంచి రూ. 1.80 కోట్లు విడుదల చేశారు. జాతీయ రహదారి నుంచి ఫ్రూట్ఫారమ్ వరకు రోడ్డు ఎత్తు లేపడంతో పాటు దయ్యాల వాగు సమీపంలో బండ్ ఏర్పాటు చేసి 1300 మీటర్ల మేర సీసీ రోడ్డు నిర్మించడంతో గ్రామస్తులు సంబురం వ్యక్తం చేస్తున్నారు.
మా గ్రామంలో సుమారు 33 గిరిజన కుటుంబాలున్నాయి. 150 మంది జనాభా కలిగిన ఈ గ్రామానికి రోడ్డు సౌకర్యం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎన్ని సార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా రోడ్డు వేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. చల్వాయి సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన తర్వాత నేను బీఆర్ఎస్ పార్టీలో చేరి అప్పటి మంత్రి సత్యవతిరాథోడ్, దివంగత జడ్పీ మాజీ చైర్మన్ జగదీశ్వర్ సహకారంతో రోడ్డు నిర్మించుకోవడం సంతోషంగా ఉంది.