Municipal Elections |రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకు సగటున 28.48 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 52,17,413 మంది ఓటర్లలో 14,85,767 మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు.
ఉదయం 11 గంటల వరకు డేటా ప్రకారం జోగులాంబ గద్వాల జిల్లా ఐజా మున్సిపాలిటీలో అత్యధికంగా 47.52 శాతం పోలింగ్ నమోదైంది. ఆ తర్వాత వడ్డేపల్లిలో 46.61 శాతం పోలింగ్ నమోదైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో 45.18 శాతం, ఖమ్మం జిల్లా కల్లూరు మున్సిపాలిటీలో 45.05 శాతం పోలింగ్ రికార్డయ్యింది.
ఇదిలా ఉంటే.. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పలు చోట్ల ఉద్రిక్త వాతారణం నెలకొంది. మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కార్యకర్తలపై బీజేపీ నేతలు దాడికి దిగారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రతిఘటించారు. ఇరు పార్టీల నేతలు గల్లాలు పట్టుకుని కొట్టుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఇరు పార్టీల వారిని చెదరగొట్టారు. మరోవైపు మహబూబాబాద్ మున్సిపాలిటీలోని 14వ వార్డులో పోలింగ్ కేంద్రం వద్ద కాంగ్రెస్ అభ్యర్థి నాగేశ్వరరావు ప్రచారం నిర్వహించారు. దీన్ని బీఆర్ఎస్ అభ్యర్థి కృష్ణ అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు పార్టీల మధ్య ఘర్షణ నెలకొంది. ఇది గమనించిన పోలీసులు ఇరు వర్గాలను అక్కడి నుంచి చెదరగొట్టారు.

నర్సాపూర్‌లో
మంచిర్యాల జిల్లాలోని పోలింగ్ కేంద్రాల వద్ద ప్రతిపక్ష బీఆర్ఎస్ ఏజెంట్లను లక్ష్యంగా చేసుకుని పోలీసులతో దౌర్జన్యం చేయిస్తోంది. బీఆర్ఎస్ ఏజెంట్లను పోలింగ్ బూత్‌ల లోపలికి వెళ్లకుండా అడ్డుకుంటోంది. లక్సేట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని 9వ, 10వ పోలింగ్ కేంద్రాల దగ్గర బీఆర్ఎస్ ఏజెంట్‌గా ఉన్న మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్‌ను పోలింగ్ బూత్ లోపలికి వెళ్లకుం పోలీసులు అడ్డుకున్నారు. ఆయన ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించడంతో పోలింగ్ కేంద్రం ఆవరణ నుంచి పక్కకు ఈడ్చుకెళ్లారు. పోలీసుల తీరును నిరసిస్తూ ఆయన పోలింగ్ కేంద్రం ఎదురుగా రోడ్డుపై బైఠాయించారు.

ఎల్లారెడ్డిలో నిరసన తెలుపుతున్న బీఆర్ఎస్ నాయకులు
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. అధికార పార్టీ ఎమ్మెల్యే మదన్ మోహన్ రావుకు పోలీసులు వత్తాసు పలుకుతున్నారని ఆరోపిస్తూ ఎల్లారెడ్డి పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఆందోళన చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.
మహబూబ్‌నగర్‌లోని 45వ డివిజన్లో బ్యాలెట్ పేపర్లో అభ్యర్థుల సీరియల్ నంబర్లు, గుర్తులు తారుమారయ్యాయి. ముందుగా ఇచ్చిన నమూనా బ్యాలెట్లో ముందు ప్రధాన పార్టీల గుర్తులు.. ఆ తర్వాత జనసేన, ఇతర పార్టీల గుర్తులను ఇచ్చారు. కానీ అనూహ్యంగా పోలింగ్ రోజు ఇచ్చిన బ్యాలెట్లో జనసేన పార్టీకి ఒకటో నంబర్ ఇచ్చారు. దీంతో ప్రధాన పార్టీల గుర్తులన్నీ మారిపోయాయి. ఎన్నికలు ప్రారంభమయ్యాక ఇది గమనించిన అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. దీంతో 20 నిమిషాల పాటు పోలింగ్ నిలిచిపోయింది. అభ్యర్థుల ఆందోళనతో రంగంలోకి దిగిన అధికారులు అభ్యర్థులతో చర్చించారు. సమన్వయంతో ఓటింగ్ ప్రక్రియను పున:ప్రారంభించారు.

భూపాలపల్లిలో స్వాధీనం చేసుకున్న నగదు
మున్సిపల్ ఎన్నికల వేళ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని పోలింగ్ కేంద్రం సమీపంలో రూ.లక్ష రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 22వ వార్డులోని పోలింగ్ కేంద్రం సమీపంలోని ఒక బండ కింద డబ్బులు దాచి, ఓటర్లకు పంచుతున్నారని కాంగ్రెస్ నాయకులు ఆందోళన చేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నాయకుల చేతిలో ఉన్న డబ్బును పోలీసులు సీజ్ చేశారు.
బీఆర్ఎస్ నాయకులు ఈ డబ్బులను పంచుతున్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. బీఆర్ఎస్ అభ్యర్థి బుర్రా సదానందాన్ని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. కాగా, కాంగ్రెస్ ఆరోపణలను బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. పట్టుబడిన సొమ్ముతో తమకెలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కావాలనే రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు.
రాకాసిపేట్‌లోని బూత్ నంబర్ 24, గోశాల ప్రాంతంలోని బూత్ నంబర్ 78లో వేరే వాళ్ల పేర్లతో ఓటు వేసేందుకు ఇద్దరు వ్యక్తులు వచ్చారు. అయితే ఓటర్ గుర్తింపు కార్డులను తనిఖీ చేస్తున్న సమయంలో తప్పుడు గుర్తింపు పత్రాలను చూపించారు. ఈ క్రమంలో వారి కదలికలపై అనుమానం వచ్చిన పోలింగ్ ఏజెంట్లు, ఎన్నికల సిబ్బంది నిలదీయడంతో దొంగ ఓట్లు వేసేందుకు వచ్చినట్లుగా వెల్లడించారు. దీంతో వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.