ఆబిడ్స్ : హైదరాబాద్ నగరంలో చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. ఒంటి మహిళలే లక్ష్యంగా గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఇవాళ (బుధవారం) ఉదయం 11 గంటలకు అబిడ్స్ ఏరియాలో బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు ఓ మహిళ మెడలోంచి చైన్‌ను లాక్కెళ్లారు. చైన్‌ను గట్టిగా లాగడంతో ఆ మహిళకు గాయాలయ్యాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
వివరాల్లోకి వెళ్తే.. చాపెల్ రోడ్డులోని మల్లారెడ్డి ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తున్న శిరీష అనే మహిళ విధులు ముగించుకుని హాస్టల్‌కు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఘటనా ప్రాంతంలోని సీపీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కాగా నగరంలో చైన్ స్నాచింగ్ ఘటనలు పెరుగుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలన్నారు.