వరంగల్ నగరంలో రౌడీరాజ్యం నడుస్తోంది. కొందరు రౌడీషీటర్లు పొలిటికల్ నేతల సపో ర్ట్తో మళ్లీ పెట్రేగుతున్నారు. భూకబ్జాలు, సెటిల్మెంట్ల దందాకు పాల్పడుతున్నారు. వినకుంటే బెదిరిస్తూ భౌతిక దాడులు చేస్తున్నారు. మరికొందరు డబ్బుల కోసం కుటుంబ పంచాయితీలు, ఆర్థిక లావాదేవీల్లో కలుగజేసుకుంటున్నారు. ఇంకొందరు పీడీఎస్ బియ్యం, గుట్కా, గంజాయి రవాణాకు పాల్పడుతూ అమాయక యువకులకు డబ్బులు, మద్యం ఆశ జూపి నేరస్తులుగా మారడానికి ఉసిగొల్పుతున్నారు. నగరంలో పోలీస్ నిఘా కొరవడడంతో తమ నేర ప్రవృత్తిని బయటపెడుతున్నారు. రౌడీషీటర్ల ఆగడాలతో నగరవాసులు ఆందోళన చెందుతున్నారు.
– సుబేదారి, నవంబర్13
ఇంతకు ముందు వరంగల్ పోలీస్ కమిషనరేట్ టాస్క్‌ఫోర్స్ విభాగం అధికారులు రౌడీషీటర్లపై నిఘా పెట్టి వారికి ట్రీట్మెంట్ ఇవ్వడంతో వెనక్కి తగ్గారు. ఈ మధ్య రౌడీషీటర్లపై పోలీసుల నిఘా లేకపోవడంతో సివిల్ వివాదాల్లో తలదూర్చడం, చిన్న విషయాలకే గొడవలు పడి భౌతిక దాడులకు పాల్పడడం వంటివి వెలుగులోకి వస్తున్నాయి. కమిషనరేట్ పరిధిలో మొత్తం 699 మంది రౌడీషీటర్లు ఉన్నారు. వీరిలో మిల్స్‌కాలనీ, మట్టెవాడ, ఇంతేజార్గంజ్, హనుమకొండ, కేయూసీ, సుబేదారి, మడికొండ, హసన్‌పర్తి పోలీస్ స్టేషన్లలో రౌడీషీట్ నమోదైన 234 మందిలో 70 మంది మోస్ట్ వాంటెడ్‌గా ఉన్నారు. వీరంతా భూ తగాదాల్లో తలదూర్చుతున్నారు.
కుటుంబపరమైన పంచాయితీలు, ఆర్థిక లావాదేవీల సెటిల్మెంట్స్ చేస్తూ రౌడీయిజం ప్రదర్శిస్తున్నారు. మోస్ట్ వాంటెడ్ రౌడీషీటర్లు, పొలిటికల్ సపోర్ట్ ఉన్న రౌడీలు తమ దందాలు వెలుగులోకి రాకుండా జాగ్రత్తగా పోకిరీలను ముందు పెట్టి డే పేమెంట్, మద్యం పార్టీలతో ల్యాండ్ సెటిల్మెంట్లు, ఆర్థిక లావాదేవీల పంచాయితీలు చేస్తున్నారు. నగరంలో హోటల్స్, రహస్య ప్రదేశాలను అడ్డాగా చేసుకొని ఇటువంటి సెటిల్మెంట్స్ చేస్తూ ఆర్థికంగా బలపడుతున్నారు. రౌడీషీటర్ల కదలికలపై కొరవడిన నిఘా కొంతకాలంగా రౌడీషీటర్ల కదలికలపై పోలీసులు నిఘా లేకుండా పోయింది. రెండు రోజుల క్రితం హనుమకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ ఇవ్వగా, వరంగల్‌లో ఆ దాఖలాలు లేవు.
కొద్ది నెలల నుంచి వరంగల్ పోలీస్ కమిషనరేట్ ప్రత్యేక విభాగం టాస్క్‌ఫోర్స్ రౌడీషీటర్ల కదలికలపై దృష్టి పెట్టడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకు ముందు ఈ విభాగంలో పనిచేసిన ఓ ఐపీఎస్ అధికారి తమదైన ైస్టెల్లో రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ చేసి పేరు తెచ్చుకున్నారు. భూ కబ్జాలకు పాల్పడితే ఎంతటివారినైనా అరెస్ట్ చేసి అణచివేశారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోవడంతో రౌడీషీటర్లు మళ్లీ రెచ్చిపోయి దందాలకు పాల్పడుతూ, అమాయకులపై భౌతిక దాడులకు పాల్పడుతున్నారు. రాత్రివేళ కొందరు రౌడీషీటర్లు స్థానిక యువకులను చేరదీసి గ్యాంగ్‌లు ఏర్పాటు చేసుకొని దందాలకు పాల్పడుతున్నారు. మిడ్నైట్ దాకా మందు పార్టీలు చేసుకోవడం, ఆ సమయాల్లో రోడ్లపై వచ్చీపోయే వాహనదారులను కొట్టి, డబ్బులు లాక్కోవడం వంటి సంఘటనలు అక్కడక్కడా జరుగుతున్నాయి.