నయీంనగర్, ఏప్రిల్ 29 : తాను ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి మనిషినని, ఆయన అను చరుడు కోన శ్రీకర్ రౌడీలు, జేసీబీలతో వచ్చి బెదిరించి ఇంటిని ధ్వంసం చేసినట్లు బాధితులు వాపోయారు. బాధితురాలు చింతల స్వరూప తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని వడ్డేపల్లి ప్రభుత్వ పాఠశాలను ఆనుకొని ఉన్న ప్రాంతంలో తన మామ(భర్త తండ్రి) చింతల వెంకట్రాంనర్సయ్య నుంచి సంక్రమించిన ఇంట్లో 30 ఏళ్లుగా ఉంటున్నాం. కరెంట్ మీటర్, ఇంటి పన్ను కడుతున్నాం. అయితే, మంగళవారం నేను, నా కూతురు, ఆమె చిన్నపిల్లలు ఇంట్లో ఉన్న సమ యంలో ఎమ్మెల్యే నాయిని అనుచరుడు కోన శ్రీకర్ కొంతమంది రౌడీలు, జేసీబీలతో వచ్చి బెది రించి సెల్ఫోన్లను లాక్కొని ఇంటిని ధ్వంసం చేశారు. కాగా, ఉగాది పండుగ ముందు రోజు ఇలా గే జరగడంతో ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి వద్దకు వెళ్లి చెప్పుకొంటే అలా ఏమీ చేయరని హామీ ఇచ్చా రు. మళ్లీ ఇప్పుడు ఎమ్మెల్యే ఫోన్ చేసి ఆ భూమి మీది కాదంట కదా అని అనడంతో ఏం చేయాలో అర్థం కావడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
‘వారసత్వ భూమిని కబ్జా చేస్తున్నాడు.. స్థానిక ఎమ్మెల్యే అనుచరుడినని బెదిరిస్తున్నాడు’ అంటూ ‘నమస్తే తెలంగాణ’లో ఈ నెల 5న కథనం ప్రచురితమైంది. దీంతో అంతా సద్దుమణిగిందని అనుకునే లోపే మళ్లీ ఇంటిని ధ్వంసం చేయడమేంటని బాధితులు ప్రశ్నిస్తున్నారు. గతంలో వైఎస్ రాజశేఖర్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2007లో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇల్లు ఇవ్వగా, నేడు అదే ఇంటిని జేసీబీలతో కూలగొట్టి కబ్జా చేసేందుకు ఆ పార్టీ నాయకులే ప్రయత్నించడం ఏంటని పలువురు విమర్శిస్తున్నారు. గత నెల రోజుల నుంచి బాధితులు సుబేదారి పోలీస్స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా ఇప్పటివరకు ఎలాంటి విచారణ చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తున్నది.