ఉమ్మడి జిల్లాలో వర్షాలతో రోడ్లు దెబ్బతిని ప్రయాణం నరకంగా మారింది. సాఫీగా ప్రయాణం సాగించాల్సిన రహదారులపై అడుగుకో గుంత పడి వాహనదారులకు పరీక్ష పెడుతోంది. భూపాలపల్లి జిల్లాలో సుమారు 100 కి.మీ మేర, ములుగు ఏజెన్సీలో 80 శాతం రోడ్లు ధ్వంసమై ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్నాయి. రెండేళ్లుగా నిధులు లేక మరమ్మతుకు నోచుకోక ప్రజలకు రవాణా కష్టాలు తప్పడం లేదు.
– జయశంకర్ భూపాలపల్లి/ములుగు, సెప్టెంబర్ 7(నమస్తే తెలంగాణ)
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సుమారు వారం రోజుల పాటు ఎడతెరిపిలేకుండా వర్షాలు కురవడంతో సుమారు 100 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నాయి. చిట్యా ల మండలంలో అందుకుతండా, అందుకుతండా-వెంచరామి, బావుసింగ్‌పల్లి-ఆర్అండ్బీ రోడ్డు, కొత్తపేట-ముచినిపర్తి, భూ పాలపల్లి మండలంలో కాశీంపల్లి-గొర్లవీడు, రేగొండ మండలం కోనరావుపేట-కొత్తపల్లి, మొగుళ్లపల్లి మండలంలో కోనరావుపేట-కొత్తపల్లి, వేములపల్లి-కాసులపాడ్, వేములపల్లి-మర్రిపల్లిగూడెం, మొ గుళ్లపల్లి-కొర్కిశాల, మొగుళ్లపల్లి-పర్లపెల్లి, మహాముత్తారం మండలంలో మీనాజీపేట-నర్సింగాపూర్, బోర్లగూడెం-నర్సింగాపూర్, పెగడపల్లి-ప్రేమ్‌నగర్, నిమ్మగూడెం-యత్నారం, యత్నారం-సింగంపల్లి, గణపురం మండలంలో రంగారావుపల్లి-లక్ష్మీదేవిపేట, గొర్లపల్లి-8 ఇైంక్లెన్ రోడ్డు, నగరంపల్లి-అప్పయ్యపల్లి, టేకుమట్ల మండ లం కుందనపల్లి-ద్వారకపేట గ్రామాల మ ధ్య రోడ్లు ధ్వంసమయ్యాయి. రోడ్ల నిర్మాణానికి రూ. 2 కోట్లతో ప్రతిపాదనలు పంపినట్లు అధికారులు చెబుతున్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టినప్పటికీ అధికారులు ఇం కా ప్రతిపాదనలు సమర్పించే స్థాయిలోనే ఉన్నారని, కనీసం తాత్కాలిక మరమ్మతు లు కూడా చేయడం లేదని ఆయా గ్రామాల ప్రజలు మండిపడుతున్నారు. గతుకుల, తెగి న రోడ్లతో ఇబ్బందుల మధ్య ప్రజలు ప్రయా ణం చేస్తున్నారు.
భారీ వర్షాలతో ములుగు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో 80 శాతం రహదారులు అస్తవ్యస్తంగా తయారయ్యాయి. ఏటూరునాగారం మండలంలోని కొండాయి గ్రామానికి వెళ్లేందుకు గత మూడు నెలల నుంచి గ్రామస్తులు బోటు సహాయంతో వాగును దా టాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. వెంకటాపురం(నూగూరు) నుంచి చెర్ల మీదుగా భద్రాచలం వెళ్లే రహదారిలో రాళ్ల వాగు వద్ద వంతెన కూలిపోవడంతో వర్షం కురిసినప్పుడల్లా రాకపోకలు నిలిచిపోతున్నాయి. తాడ్వాయి మండలంలో జంపన్నవాగు, దయ్యాలవాగు ప్రవహించి రోడ్లు కోతలకు గురయ్యాయి. గోవిందరావుపేట మండలంలో ప్రాజెక్టు నగర్, ఇతర గ్రామాలకు వెళ్లే రోడ్లు దెబ్బతిన్నాయి. రాళ్లవాగు వంతెన నిర్మాణం గత రెండేళ్లుగా కొనసాగుతుండగా ఇటీవల కురిసిన భారీ వర్షానికి డైవర్షన్ రోడ్డు తెగిపోయి నాలుగు రోజుల పాటు ములుగు నుంచి భూపాలపల్లి జిల్లా కేంద్రానికి వెళ్లే వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. మల్లంపల్లి మం డలంలో జాతీయ రహదారి నుంచి భూపాల్‌నగర్ వెళ్లే రహదారి పూర్తిగా దెబ్బతిని వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా జాతీ య రహదారిపై కాకతీయ కెనాల్ మీదుగా వెళ్లే వంతెన గత నెల 7వ తేదీన కూలిపోవడంతో తాత్కాలిక వంతెన పూర్తయ్యే వరకు 15రోజుల పాటు వాహనదారులు 20 నుంచి 30 కిలోమీటర్ల అదనపు దూరాన్ని ప్రయాణించాల్సి వచ్చింది.
శాయంపేట : రహదారులు గుంతలమయం కావడంతో వాహన చోదకులకు సర్కస్ ఫీట్లు తప్పడం లేదు. శాయంపేట నుంచి కొత్తగట్టుసింగారం వరకు మూడు కిలోమీటర్లు బైపాస్ రోడ్డు ధ్వంసమైంది. కాట్రపల్లి నుంచి గొల్లపల్లి, గంగిరేణిగూడెం వరకు రోడ్డు పూర్తిగా గుంతలు పడ్డాయి. భయంభయంగా వెళ్లాల్సి వస్తుందని గ్రామస్తులు చెబుతున్నారు. రెండు కిలోమీటర్ల దూరంపైగా ఉన్న ఈ బీటీ రోడ్డు అడుగుకో గుంత అన్నట్టుగా మారింది. దీంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. ఇప్పటికైనా గుంతల ను పూడ్చి మరమ్మతు చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు.