జనగామ చౌరస్తా, జనవరి 31 : ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి కృషితో జనగామ నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంత రోడ్లకు మహర్దశ వచ్చింది. జనగామ, చేర్యాలలో బీటీ, పీడబ్ల్యుడీ రోడ్ల మరమ్మతు పనుల కోసం ప్రభుత్వం నుంచి రూ.9.31 కోట్లు మంజూరు చేయించారు. ఈమేరకు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ నుంచి జీవో నంబర్ 59 ద్వారా ప్రొసీడింగ్స్ ఉత్తర్వులు విడుదలయ్యాయి.
పెంబర్తి నుంచి పోచన్నపేట గ్రామాల పరిధిలో 7.90 కిలోమీటర్ల మేర బీటీ రోడ్డు పనులతో పాటు కమలాయపల్లి వయా తాడూరు, చిట్యాల గ్రామాల మీదుగా పీడబ్ల్యూడీ రోడ్డు 9.70 కిలోమీటర్లు కలిపి మొత్తంగా 17.60 కిలోమీటర్ల రోడ్డు మరమ్మతు పనులకు అనుమతులు వచ్చాయి. రహదారులతోనే గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి సాధ్యమని బలంగా విశ్వసించిన ఎమ్మెల్యే పల్లా, ఈ నిధుల మంజూరు కోసం తీవ్రంగా శ్రమించారు.