మహదేవపూర్(కాళేశ్వరం), సెప్టెంబర్ 28: ఎగువన కురుస్తున్న వర్షాలతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని మేడిగడ్డ బరాజ్‌కు గోదావరి వరద ప్రవాహం పెరుగుతోంది. శనివారం బరాజ్ ఇన్‌ఫ్లో 6,94,800 క్యూసెక్కులు కాగా, ఆదివారం 7,71,580 క్యూసెక్కులకు పెరిగింది. దీంతో బరాజ్‌లోని మొత్తం 85 గేట్లు ఎత్తి అంతే మొత్తంలో వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
ప్రస్తుతం వరద ప్రవాహం సముద్రమట్టానికి 96 మీటర్ల ఎత్తులో ఉందని భారీ నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. కాళేశ్వరంలో గోదావరి నది ప్రవాహం 10.4 మీటర్ల ఎత్తులో ఉందని సీడబ్ల్యూసీ అధికారులు తెలిపారు. వరద పెరుగుతున్న నేపథ్యంలో గోదావరి పరివాహక ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.