నమస్తే నెట్ వర్క్, ఏప్రిల్ 4 : అకాల వర్షంతో రైతన్న ఆగమాగమవుతున్నాడు. గురువారం రాత్రి, శుక్రవారం ఈదురు గాలులతో కురిసిన వానకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పంటలు దెబ్బతిన్నాయి. వరి పంట నేలవాలగా, మామిడి కాయలు రాలిపోయా యి. చేతికొచ్చిన మక్కజొన్న, మిర్చి పంట నీళ్లపాలయ్యింది. బయ్యారం మండలంలోని ఏజెన్సీ గ్రామాల్లో కల్లాల్లో ఆరబోసిన మక్కజొన్న తడిసింది. మిర్చిపై టార్పాలిన్ కప్పినా ఫలితం లేకుం డా పోయింది. సంగ్యాతండాలో మిర్చి, మక్క పూర్తిగా నీట మునిగింది.
కొత్తగూడ, గంగారం, నర్సింహులపేట, వర్ధన్నపేట, గోవిందరావుపేట మండలాల్లో వరి, మక్కజొన్న పంట నేలవాలింది. ధాన్యం గింజలు సైతం రాలిపోయాయి. నెక్కొండ వ్యవసాయ మార్కెట్లో ఆరబోసిన మక్కజొన్నలు తడిసి ముద్దయ్యాయి. ఆయా గ్రామాల్లో తడిసిన పంటలను వ్యవసాయ అధికారులు పరిశీలించారు. రైతులకు సలహాలు, సూచనలు అందించారు.
అదేవిధంగా వెంకటాపురం (నూగూరు) నుంచి భద్రాచలానికి వెళ్లే రోడ్డు మార్గంలో రాళ్లవాగు వద్ద ఏర్పాటు చేసిన డైవర్షన్ రో డ్డు కొట్టుకుపోవడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ఆర్టీసీ బస్సులను మణుగూరు, ఏటూరునాగారం మీదుగా మండల కేంద్రానికి తరలించారు. ఇతర వాహనాలు వాగుదాటి వెళ్లేందుకు వీలు లేక ఇబ్బందులు పడ్డారు. కాగా, నష్టపోయిన పంటలకు ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని రైతులు, రైతు సంఘాల నాయకులు కోరుతున్నారు.