దేవరుప్పుల, ఫిబ్రవరి 14: ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన అని చెప్పుకుంటున్న ఈ ప్రభుత్వం జర్నలిస్టుల గొంతునొక్కి, వారిపై ఉక్కుపాదం మోపాలని చూడడం ప్రజాపాలన అవుతుందా? అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆర్జీ టీవీ జర్నలిస్ట్ రాజ్‌కుమార్‌ను అక్రమంగా అరెస్ట్ చేసి హైదరాబాద్‌కు తరలించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. అరెస్ట్ విషయం తెలిసిన వెంటనే ఆయన నేరు గా సైబర్ క్రైమ్ ఆఫీసుకు వెళ్లి డీసీపీతో పాటు సంబంధిత అధికారులతో మాట్లాడారు. రాజ్‌కుమార్‌కు ధైర్యం చెప్పి బీఆర్ఎస్ అండగా నిలుస్తుందన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజ్‌కుమార్‌పై గతంలో అక్రమ కేసులు పెట్టి 14 రోజులు జైలు పాలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం, అతడిపై మరోమా రు ఉక్కుపాదం మోపాలని చూస్తున్నదని మండిపడ్డారు. కొడంగల్ ప్రజల ఆవేదనను తన యూట్యూబ్ చానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లడం అతను చేసిన తప్పా అని ప్రశ్నించారు. ‘మీకు చేతనైతే జర్నలిస్టులు వెలికితీస్తున్న ప్రజాసమస్యలను పరిష్కరించి ప్రజాప్రభుత్వంగా గుర్తింపు పొందండి… కానీ ఇలా అక్రమ కేసులు పెట్టి నియంత పాలనను తలపించేలా చేయకండి’.. అని ఎర్రబెల్లి హితవు పలికారు. రాజ్‌కుమార్‌పై పెట్టిన కేసులు ఉపసంహరించుకోవాలని, అతడిని వదిలిపెట్టాలని ఎర్రబెల్లి డిమాండ్ చేశారు.