ఇసుక అక్రమ దందాకు పోలీసు, రెవెన్యూ అధికారులు అండగా నిలుస్తున్నారు. మామూళ్ల మత్తుకు అలవాటు పడి అక్రమార్కులతో అంటకాగుతున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఉమ్మడి జిల్లా పరిధిలోని వాగుల నుంచి తోడుతున్న ఇసుకను తరలించేందుకు సహకరిస్తున్నారు. ఇందుకోసం పొైక్లెన్, ట్రాక్టర్ యజమానుల నుంచి మామూళ్లు దండుకుంటున్నారు. ఒక్కో వాహనానికి పక్కాగా రేటు ఫిక్స్ చేసి నెలవారీగా వసూలు చేస్తున్నారు. అమ్యామ్యాలు సమర్పించుకున్న వాహనాలు ఎలాంటి అడ్డంకులు లేకుండా గమ్యస్థానాలకు వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఒకరిని నియమించుకొని కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. ఉన్నతాధికారులు తనిఖీలకు వచ్చే సమాచారాన్ని ముందస్తుగానే లీక్ చేసి తమ విధేయతను చాటుకుంటున్నారు. ఇటీవలి ప్రభుత్వ ఆదేశాలను తమకు అనుకూలంగా మల్చుకుంటున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేల అనుచరుల వాహనాలకు మినహాయింపులు ఇస్తున్నారు.
– వరంగల్, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
ఇసుక అక్రమాలపై కఠిన చర్యలు తీసుకుంటామన్న ప్రభుత్వ మాటలు ప్రకటనలకే పరిమితవుతున్నాయి. క్షేత్రస్థాయిలో పోలీసు, రెవెన్యూ అధికారులే ఈ అవినీతికి అండగా నిలుస్తున్నారు. గోదావరిలోని ప్రభుత్వ రీచ్‌ల నుంచి లారీల్లో వచ్చే ఇసుకకు సమానంగా ఆకేరు, మానేరు, చలివాగుల నుంచి వందల ట్రాక్టర్లలో ఇసుక ప్రతిరోజూ వరంగల్ నగరానికి చేరుతున్నది. ఉమ్మడి జిల్లాలోని వాగులతో పాటు వాటికి ఇరువైపులా ఉన్న అసైన్డ్, పట్టా భూముల్లో ఎలాంటి అనుమతులు లేకుండా అడ్డగోలుగా ఇసుక తవ్వకాలు జరిపి అక్రమంగా రవాణా చేస్తున్నారు. ఇది సజావుగా సాగేందుకు పోలీసు, రెవెన్యూ శాఖల అధికారులు నెలవారీ మామూళ్లు అందుకుంటున్నారు. ఇసుకను తరలించే మార్గంలోని ప్రతి పోలీసు స్టేషన్, రెవెన్యూ ఆఫీసుకు ఒక్కో పొైక్లెన్కు నెలకు రూ. 50 వేలు, ట్రాక్టరుకు రూ. 3 వేల చొప్పున లెక్కగట్టి ముట్టజెబుతున్నారు.
ఆకేరు వాగు నుంచి వరంగల్‌కు ఇసుక రవాణా అయ్యే రోడ్డులోని వర్ధన్నపేట, జఫర్‌గఢ్, ఐనవోలు, మామునూరు, మిల్స్‌కాలనీ, మహబూబాబాద్ జిల్లాలోని నెల్లికుదురు, నర్సింహులపేట, చిన్నగూడూరు, మరిపెడ, డోర్నకల్, జనగామ జిల్లాలోని చీటకోడూరు, యశ్వంతాపూర్ వాగులున్న దేవరుప్పుల, లింగాలఘనపురం పోలీసు స్టేషన్లకు యజమానుల నుంచి మామూళ్లు అందుతున్నాయి. పొైక్లెన్ ఓనర్లు నేరుగా, ట్రాక్టర్ల యజమానులు సిండికేట్‌గా వసూలు చేసి అందజేస్తున్నారు. ఇసుక తవ్వకాలు జరిపే మండలాల తహసీల్ కార్యాలయాలకూ ఇంతే మొత్తంలో సమర్పించుకుంటు న్నారు. వర్ధన్నపేట, ఐనవోలు తహసీల్దారు ఆఫీసుల్లో మాత్రం డబ్బుల రూపంలో కాకుండా కార్యక్రమాలు, ఇతర ప్రత్యేక అవసరాల బిల్లుల కోసం చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిసింది. ఇసుక అక్రమ దందాలో మామూళ్ల వ్యవహారాన్ని చక్కబెట్టేందుకు పోలీసు స్టేషన్లలో ఉన్నతాధికారులు ప్రత్యేకంగా కానిస్టేబుల్‌ను నియమించుకున్నారు. ఇసుక ట్రాక్టర్లను రెవెన్యూ, రవాణా శాఖ అధికారులు తనిఖీ చేయకుండా ఈ కానిస్టేబుల్ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల పరిధి అటవీ ప్రాంతాల్లోని వాగుల నుంచి ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతున్నది. మల్హర్ మండలం సరిహద్దు మానేరు వాగులోని ఇసుకను ప్రభుత్వ రీచ్‌ల ఇసుకగా చెప్పి వరంగల్, పెద్దపల్లికి తరలించి అధిక ధరకు అమ్ముతున్నారు. భూపాలపల్లి మండలం దూదేకులపల్లి పెద్దవాగు, బొగ్గులవాగు, కాశీంపల్లి చెలిమెలవాగు, తీగెల వాగు, మోరంచపల్లి వాగు, గద్దెకుంటవాగు, చిట్యాల మండలం కాల్వపల్లి వాగు, టేకుమట్ల మండలంలోని మానేరు వాగు నుంచి ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతున్నది. ఇక్కడి పోలీసులు, రెవెన్యూ, అటవీ అధికారులకు ట్రాక్టర్ల యజమానుల నుంచి ప్రతినెలా రూ. 10 వేల చొప్పున మామూళ్లు అందుతున్నాయి.
ఇసుక అక్రమ రవాణాలో పోలీసు, రెవెన్యూ అధికారుల జోక్యం ఇటీవల మరోసారి వెలుగు చూసింది. ఇసుక అక్రమ దందాపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. ఆ వెంటనే వరంగల్ పోలీసు కమిషనర్, ఇతర జిల్లాల ఎస్పీలు ఇసుక అక్రమ తవ్వకాలు జరిగే ప్రాంతాలను స్వయంగా పరిశీలించారు. ఉన్నతాధికారులు వెళ్లినప్పుడు అక్కడ వాహనాలు లేకపోవడంతో ఏమీ లేదని తిరిగి వచ్చారు.
వరంగల్ సీపీ ఇటీవల వర్ధన్నపేట, జఫర్‌గఢ్ మండలాల్లోని ఇసుక తవ్వకాలు జరిపే గ్రామాలకు వెళ్లగా ఆయన వస్తున్న సమాచారం ఉదయమే పొైక్లెన్ ఓనర్లు, ట్రాక్టర్ల సిండికేట్‌కు చేరింది. ఇసుక వ్యవహారాల కోసం పోలీసు స్టేషన్లలో నియమించిన సిబ్బందే తనిఖీల సమాచారాన్ని ముందుగానే వారికి అందించినట్లు తెలిసింది. దీంతో ఉన్నతాధికారులు అక్కడికి వెళ్లినప్పుడు అక్కడ ఎవరూ లేకపోగా, కొన్ని గంటల ముందు వరకు ఇసుక తవ్వకాలు జరిపిన ఆనవాళ్లు మాత్రం కనిపించాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాత అధికార పార్టీ ఎమ్మెల్యేల అనుచరులుగా చెలామణి అవుతున్న వారి ట్రాక్టర్లు మాత్రమే ఇసుక అక్రమ రవాణా చేస్తున్నాయి. మిగిలిన వారి వాహనాలను తనిఖీలు, టార్గెట్ పేరిట అక్కడక్కడా పట్టుకొని కేసులు నమోదు చేస్తున్నారు.