జనగామ, మార్చి 15 (నమస్తే తెలంగాణ)/స్టేషన్‌ఘన్‌పూర్ : సీఎం రేవంత్‌రెడ్డి ఆదివారం జనగామ జిల్లాలో పర్యటించనున్నారు. స్టేషన్‌ఘన్‌పూర్ నియోజవకర్గ పరిధిలో రూ. 800 కోట్లతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం స్టేషన్‌ఘన్‌పూర్ కేంద్రంలోని పాలకుర్తి రోడ్డులో ఏర్పాటు చేసిన ప్రజాపాలన సభలో పాల్గొంటారు.
ఇందుకోసం జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేయగా, మునుపెన్నడూ లేనివిధంగా 850 మంది పోలీసు బలగాలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో రానున్న సీఎం నేరుగా శివునిపల్లిలోని సభాస్థలి వద్దకు చేరుకొని ఇందిరా మహిళా శక్తి స్టాల్స్‌ను సందర్శిస్తారు. అక్కడ వివిధ ఎస్‌హెచ్‌జీలకు సంబంధించిన ఇందిరా మహిళా శక్తి బస్సులు ప్రారంభించి అక్కడే వివిధ అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టిన అనంతరం సభలో మాట్లాడతారు.