‘కాంగ్రెస్ పాలనలో రైతులు అరిగోసపడ్డరు.. వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెట్టారు.. ఇది చాలదన్నట్లు టీ-పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పంటల సాగుకు మూడు గంటలు కరెంట్ చాలని అంటున్నడు.. రేవంత్‌రెడ్డి ఓ రాజకీయ బ్రోకర్..’ అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మండిపడ్డారు. రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కాంగ్రెస్ వైఖరిని నిరసిస్తూ బుధవారం కొడకండ్లలో నిర్వహించిన రైతు సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి మాట్లాడారు. పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో వ్యవసాయాన్ని పండుగలా మార్చిన సీఎం కేసీఆర్ నిరంతరం ఉచిత విద్యుత్ ఇస్తుంటే దీనిని ఓర్వలేని విపక్షాలు కుట్రలకు పాల్పడుతున్నాయని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పాలని ఎర్రబెల్లి పిలుపునిచ్చారు.
-కొడకండ్ల, జూలై 19
కొడకండ్ల, జూలై 19 : ‘ఉమ్మడి రాష్ట్రం లో రైతన్నలు కరెంటు కోసం కష్టాలు పడ్డరు.. రాత్రివేళ వ్యవసాయ బావుల వద్ద విష పురుగులు, పాము కాటుకు అనేక మంది ప్రాణాలు పోయినయ్.. 60 ఏండ్ల కాంగ్రెస్, టీడీపీ పాలనలో రైతుల కోసం ఏం మంచి పనులు చేశారు.. పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో రైతుల కోసం సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నరు..’ అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. వ్యవసాయానికి మూడు గంటల కరెంట్ చాలని మాట్లాడిన టీ-పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఓ రాజకీయ బ్రోకర్ అని ఆయన మండిపడ్డారు. బుధవారం మండల కేంద్రంలోని మార్కండేయ ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు సిందె రామోజీ ఆధ్వర్యంలో రైతులతో నిర్వహించిన సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం వచ్చాకే పాలకుర్తి నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అన్నారు. కొడకండ్ల మండల సైతం ఎంతగానో అభివృద్ధి చెందిందన్నారు. ఒకప్పుడు తెలంగాణలో ఎకరం భూమికి రూ. లక్ష ఉండేదని, అదే నేడు రూ.50 లక్షల నుంచి రూ.కోటి ధర పలుకుతున్నదన్నారు. సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి పనులతో గ్రామాలు అభివృద్ధి చెందాయని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో భూగర్భ జలాలు పెరిగాయని ఎర్రబెల్లి వివరించారు. సమైక్య రాష్ట్రంలో కరెంట్ కోతలు ఉండేవని, వ్యవసాయానికి 9 గంటలు ఇస్తున్నామని చెప్పి మూడు గంటలు మాత్రమే ఇచ్చేవారని ఆయన గుర్తు చేశారు.
రాత్రిపూట కరెంట్ ఇవ్వడంతో పంటపొలాల వద్ద అనేక మంది రైతులు పాములు, విషపురుగుల బారినపడి చనిపోయారని తెలిపారు. లోవోల్టేజీతో మోటర్లు, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయేవని, దీంతో రైతులపై ఆర్థికంగా భారం పడేదన్నారు. సాగునీటి కోసం బాబ్లీ ప్రాజెక్టు వద్ద తాను ఆందోళన నిర్వహించానని, పార్లమెంటు సమావేశాలకు వెళ్లినప్పుడు నన్ను బాబ్లీ పేరుతో పిలిచేవారని ఎర్రబెల్లి తెలిపారు. తెలంగాణ వచ్చాకే సీఎం కేసీఆర్ వ్యవసాయాన్ని పండుగలా మార్చి నిరంతరం ఉచిత విద్యుత్ ఇస్తుండడంతో ఏటా రెండు పంటలు పండుతున్నాయని ఎర్రబెల్లి తెలిపారు. దీనిని ఓర్వలేని కాంగ్రెస్ నాయకులు రైతులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను నామరూపాల్లేకుండా చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ వైస్ చైర్మన్ కుందూరు వెంకటేశ్వర్‌రెడ్డి, పాలకుర్తి దేవస్థాన చైర్మన్ రామచంద్రయ్య శర్మ, ఎంపీపీ ధరావత్ జ్యోతి, కొడకండ్ల మార్కెట్ చైర్మన్ పేరం రాము, టీఎస్ ఈజీసీ సభ్యుడు అందె యాకయ్య, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు దీకొండ వెంకటేశ్వర్రావు, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు పసునూరి మధుసూదన్, మాజీ జీసీసీ చైర్మన్ గాంధీనాయక్, సొసైటీ వైస్ చైర్మన్ మేటి సోమరాములు, మార్కెట్ డైరెక్టర్ కుందూరు అమరేందర్‌రెడ్డి, జక్కుల విజయమ్మ, బీఆర్ఎస్ నాయకులు చెంచు రాజిరెడ్డి, ఎండీ హసీఫ్, నజీర్, కాటూరి కృష్ణమూర్తి, కైరోజు సత్యనారాయణ, యూత్ మండల అద్యక్షుడు దేశగాని సతీశ్, తండ రమేశ్, కుందూరు విజయలక్ష్మి, పట్టణ అధ్యక్షుడు మసురం వెంకటనారాయణ, బోయిని రమేశ్ తదితరులు పాల్గొన్నారు.