హనుమకొండ/ మహబూబాబాద్ రూరల్, డిసెంబర్ 24 : ప్రాణాలు పోతున్నా బెనిఫిట్స్ ఇవ్వరా? అని రిటైర్డ్ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెండింగ్ బకాయిలు చెల్లించా లని తెలంగాణ రిటైర్డ్ ఎంప్లాయిస్ బ కాయిల సాధన కమిటీ, ప్రభుత్వ పెన్షన్‌దారుల సంయుక్త కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో హనుమకొండలోని ఏకశిలా పార్కు, మహబూబాబాద్ తహసీల్ ఎదుట దీక్ష చేపట్టారు. మహబూబాబాద్‌లో ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు హాజరై సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా పెన్షనర్స్ జేఏసీ జిల్లా అధ్యక్షుడు ఈ నర్సింహారెడ్డి, రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు దర్ల ధర్మేంద్ర తదితరులు మాట్లాడుతూ మార్చి 2024 నుంచి సెప్టెంబర్ 2025 వరకు విరమణ పొందిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు 20 నెలలు గడిచినా రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించకపోవడం దారుణమన్నారు.
పెన్షనర్లు పిల్లల పెండ్లి చేయలేక, ఇల్లు కట్టుకోలేక, చేసిన అప్పులు తీర్చలేక, బ్యాంకు ఈఎంఐలు చెల్లించలేక ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు దాదాపు 35 మంది పెన్షనర్లు రిటైర్మెంట్ బకాయిలు రాక బాధతో, ఆరోగ్యం క్షీణించి చనిపోయారన్నారు. వెంటనే పెండింగ్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎస్జీపీఏటీ వరంగల్ జిల్లా అ ధ్యక్షుడు వీరయ్య, బకాయిల సాధన కమిటీ అసోసియేట్ అధ్యక్షుడు కే దేవదాస్ మాట్లాడుతూ వెంటనే పీఆర్సీ 2020, డీఏ ఏరియర్స్, జీపీఎఫ్, జీఎల్ఐఎస్, జీఐఎస్ గ్రాట్యుటీ, సరెండర్ లీవులు, బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. దీక్షకు బీజేపీ వరంగల్, హనుమకొండ జిల్లా అధ్యక్షుడు గంటా రవికుమార్, సంతోష్‌రెడ్డి, మాజీ అధ్యక్షురాలు రావు పద్మ, పీటీఎఫ్, డీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు అశోక్, గోవిందరావు సంఘీభావం తెలిపారు.
హామీలు అమలులో కాంగ్రెస్ విఫలం : తక్కళ్లపల్లి
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైంది. 2024 మార్చి నుంచి విరమణ పొందిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు నేటి వరకు బకాయిలను చెల్లించలేదు. ఉద్యోగులు దాచుకున్న సొమ్మును కూడా గత 20 నెలలుగా ప్రభుత్వం ఇవ్వక పోవడం దుర్మార్గపు చర్య. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపే సమయంలో వారికి రావాల్సి న డబ్బులు రాక, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి వైద్య ఖర్చులు అందక మానసిక ఒత్తిడికి గురై చాలా మంది మరణించిన పరిస్థితి ఉంది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో రిటైర్డ్ ఎంప్లాయిస్ బకాయిలపై మాట్లాడి సమస్యను పరిష్కరించేలా కృషి చేస్తా. విరమణ ఉద్యోగులు పడుతున్న ఇబ్బందులను బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్తా.