జనగామ, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ) : ఈ వానాకాలం సీజన్లో కురిసిన భారీ వర్షాలతో జిల్లాలో భూగర్భజలాలు గణనీయంగా పెరిగా యి. జూన్‌లో మోస్తరు వర్షాలు కురవగా, జూలై, ఆగస్టు మాసం మొదటి ఐదురోజుల్లో భారీ వర్షపాతం నమోదైంది. జిల్లాలో సాధారణం కంటే 354 మిల్లిమీటర్ల అధిక కురవగా, చీటకోడూరు, మైలారం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు సామర్ధ్యం మేరకు పూర్తిస్థాయిలో నిండాయి. గండిరామారం 92.191 శాతం, బొమ్మకూరు 90.177 శాతం, నవాబ్‌పేట 70.357 శాతం, ఆర్ఎస్ ఘన్పూర్ 79.745 శాతం నిండాయి. అధిక నీటి నిల్వ సామర్ధ్యమున్న అశ్వరావుపల్లి రిజర్వాయర్‌లోకి మాత్రం 35.135 శాతం నీరు చేరింది. జిల్లాలోని 965 పెద్ద, చిన్న చెరువులకు గానూ 64 నీటి వనరులు 25 నుంచి 50 శాతం, 106 చెరువులు, కుంటలు 50 నుంచి 75 శాతం, 503 చెరువులు 75 నుంచి 100 శాతం, 292 నీటి వనరులకు అదనపు (మిగులు) నీరు చేరి మత్తడి పోస్తున్నాయి. ఇక జిల్లాలోని అశ్వరావుపల్లి రిజర్వాయర్ మినహా దేవాదుల రిజర్వాయర్లు అన్నీ 90 శాతం నిండి కళకళలాడుతున్నాయి.
నీటి వనరులు పుష్కలంగా అందుబాటులో ఉండడంతో వానకాలంతోపాటు వచ్చే యాసంగికి సాగు, తాగునీటికి ఢోకాఉండదని అధికారులు అంటున్నారు. మంగళ, బుధ, గురువారాల్లో రాత్రి పూట మోస్తరు నుంచి భారీ వర్షం పడగా, శుక్రవారం మధ్యాహ్నం రఘునాథపల్లి తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. మిగిలిన మండలాల్లో మోస్తరు వాన పడింది. ఎగువ ప్రాంతంలోని చెరువులు, కుంటలు సహా వాగులపై ఉన్న చెక్‌డ్యాములు నిండి మత్తడి పారుతూ దిగువనున్న దేవాదుల జలశయాల్లోకి భారీగా వరదనీరు చేరడంతో అవి నిండుకుండల్లా మారాయి. మరోపక్క జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ప్రజలను అప్రమత్తం చేసింది. జనగామ మండలం చీటకోడూరు వాగు, రిజర్వాయర్, లింగాలఘనపురం మండలం కుందారం వాగులను శుక్రవారం అధికారులు పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. రాబోయే 48గంటలపాటు వానలు కొనసాగే అవకాశం ఉందన్న వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని జిల్లా యంత్రాంగం రెడ్ అలర్ట్ ప్రకటించింది. జనగామ పట్టణం సహా జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు, ముంపు ప్రాంతాలను గుర్తించి చర్యలకు ఆదేశించారు. పునరావాస, రిలీఫ్ కేంద్రాలను సిద్ధం చేసుకొని అవసరమైతే ప్రజలను తరలించేందుకు యం త్రాంగం సిద్ధమైంది. కాగా, వర్షాలకు జనగామ పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు జలయమయ్యాయి. నాలాలు, బాక్స్డ్రైనేజీలు పొంగిపొర్లుతుండగా, వర్షానికి రోడ్లన్నీ వరద, డ్రైనేజీ నీటితో పారుతున్నాయి. 0.3 సామర్థ్యమున్న జనగామ శివారులోని చీటకోడూరు రిజర్వాయర్ నిండుకుండలా మారింది. దీంతో ముందుజాగ్రత్త చర్యగా రిజర్వాయర్ నాలుగు గేట్లు ఎత్తిన అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
లోతట్టు ప్రాంతాలు జలమయం..
జిల్లా కేంద్రంలోని పలు కాలనీలు, లోతట్టు ప్రాంతాలు, రోడ్లన్నీ ఇంకా వరదనీటిలోనే ఉన్నాయి. హైదరాబాద్-హనుమకొండ ప్రధాన రహదారి సహా పలు కాలనీలు జలమయమయ్యాయి. పట్టణానికి ఎగువనున్న రంగప్పచెరువు మత్తడి పోయడంతో దిగువనున్న కాలనీల్లోకి నీరు చేరింది. వరదనీరు ప్రవహిస్తున్న లోలెవల్ కల్వర్టులను గుర్తించిన అధికారులు రాకపోకలు నిలిపివేసి సహాయక చర్యలు చేపట్టారు. ప్రధాన రహదారుల్లోని లోలెవల్ వంతెన వద్ద నిఘా పెంచారు. భారీ వర్షాలు, వరదలపై జిల్లా కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులతో సమీక్షిస్తున్నారు. జిల్లాలో కోతకు గురైన రోడ్లు, నీట మునిగిన పంటలపై నివేదిక అందించాలని అధికారులను ఆయన ఆదేశించారు. గురువారం జనగామ మండలం వడ్లకొండలో అత్యధికంగా 75.3 మి.మీ, బచ్చన్నపేటలో 57.0 మి.మీ వర్షం నమోదైతే శుక్రవారం రఘునాథపల్లి మండలంలో అత్యధికంగా 49.0 మి.మీ వర్షం కురిసింది.
దేవరుప్పులలో..
ఎడతెరిపిలేని వర్షాలతో దేవరుప్పుల మండలంలోని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. మరోవైపు చెరువులు అలుగు పోస్తున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటల వరకు వర్షం కురవడంతో 39 మిల్లీమీటర్లు నమోదైనట్లు తహసీల్దార్ రవీందర్‌రెడ్డి తెలిపారు. వడ్లకొండ వాగు, యశ్వంతాపూర్ వాగు జోరుగా ప్రవహిస్తున్నాయి. వీటిపై నిర్మించిన తొమ్మిది చెక్‌డ్యాములు పక్షం రోజుల నుంచి మత్తడిపడుతున్నాయి. మరోవైపు వరి నాట్లు ఊపందుకున్నాయి. భారీ వర్షాలతో నల్లరేగడి భూముల్లోని పత్తి చేలల్లో నీరు చేరి కలుపు పెరిగింది. దిగుబడులు తగ్గుతాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
బచ్చన్నపేటలో..
మండలంలోని ఆయా గ్రామాల్లో శుక్రవారం సాయంత్రం వర్షం కురిసింది. రాత్రి వరకూ వర్షం కురుస్తుండడంతో వాగులు, వంకలు వరదలతో ప్రవహించాయి. బండనాగారంతో సహా పలు గ్రామాల్లో చెరువులు మత్తళ్లు దుంకుతున్నాయి. మండల కేంద్రంలోని సౌటకుంట (బతుకమ్మకుంట ) నిండిపోయి కట్టపై నుంచి నీరు ప్రవహించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆలింపూర్ కొత్త చెరువు కట్టపై ఐదుచోట్ల గండిపడింది. అధికారులు స్పందించి కట్టకు మరమ్మతు చేయాలని, లేకుంటే తెగిపోయే ప్రమాదం ఉందని సర్పంచ్ నరెడ్ల బాల్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయనతోపాటు టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చంద్రారెడ్డి, నాయకులు చల్లా శ్రీనివాస్‌రెడ్డి కట్టను పరిశీలించారు. వర్షాలు సమృద్దిగా కురుస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై సృజన్‌కుమార్ సూచించారు.
స్టేషన్‌ఘన్‌పూర్‌లో..
మండలంలోని రంగ రాయగూడెం, కోమటిగూడెం, బో యినగూడెం, అక్కపల్లిగూడెం గ్రామాల్లో శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు భారీ వర్షం కురిసింది.. దీంతో నాట్లు వేసిన పొలాల్లో ఇసుక మేటలు వేశాయి. నాట్లకు సిద్ధం చేసిన పొలాల్లో ఇసుక కమ్ముకోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది లా ఉండగా పత్తి చేన్లలో నీరు నిల్వడంతో దిగుబడులు తగ్గుతాయని భావిస్తున్నారు.