ములుగు, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ) : ప్రజల భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని కాకతీయ రాజులు గొలుసుకట్టు చెరువులను నిర్మించగా.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నాటి సీఎం కేసీఆర్ సాగునీటి రంగంలో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పుల కారణంగా ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేటలోని రామప్ప సరస్సు సుజల ప్రదాయినిగా మా రింది.
గత కొన్నేళ్ళుగా ప్రతి వానకాలంలో కురుస్తున్న వర్షాలకు రామప్ప సరస్సు నిండి మత్తడి దుంకుతున్నది. కాగా, దేవాదుల ప్రాజెక్టులో భాగంగా రామప్ప సరస్సును సాగునీటి ఇంజనీరింగ్ శాఖ అధికారులు వాటర్ గ్రిడ్‌గా ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా భీమ్‌గణపురం చెరువు నుంచి 4 మోటర్ల ద్వారా సరస్సులోకి నీరు చేరేలా ఏర్పాట్లు చేశారు. గత తొమ్మిదేళ్లుగా ప్రతి వేసవిలో ఇందులోకి గోదావరి జలాలను పంపింగ్ చేస్తున్నారు. ఈసారి 2,869 మిలియన్ క్యూబిక్ ఫీట్ల (ఎంసీఎఫ్‌టీ) నీటిని పంపింగ్ చేసేందుకు వారం రోజుల క్రితం మోటర్లను ఆన్ చేశారు. ప్రస్తుతం రెండు మోటర్ల ద్వారా 100 ఎంసీఎఫ్‌టీల జలాలను పంపింగ్ చేస్తున్నారు.
భీమ్ గణపురం చెరువు నుంచి రెండు మోటర్ల ద్వారా 100 ఎంసీఎఫ్‌టీల (ఒక్కో మోటర్తో 50 ఎంసీఎఫ్‌టీలు) జలాలను రామప్పకు తరలించేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. సరస్సులోకి చేరిన నీటిని మూడు నియోజకవర్గాల పరిధిలో 60 ఎంసీఎఫ్‌టీల నీటిని పంపింగ్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా నర్సంపేట నియోజకవర్గంలోని రంగాయ చెరువును నింపి అక్కడి నుంచి ఖానాపురం మండలం పాకాల సరస్సుకు 1,050 ఎంసీఎఫ్‌టీల జలాలను వేసవిలో తరలించేందుకు నిర్ణయించారు.
భూపాలపల్లి నియోజకవర్గంలోని గణపురం చెరువును నింపనున్నారు. అలాగే ఇక్కడ ఏర్పా టు చేసిన మిషన్ భగీరథ పంప్ హౌస్ నుంచి ములుగు జిల్లాలోని ములుగు, వెంకటాపూర్, గోవిందరావుపేట, మల్లంపల్లితో పాటు గణపురం మండలంలోని పలు గ్రామాలకు మిషన్ భగీరథ ద్వారా తాగునీరందించనున్నారు. కాగా, గత జనవరిలో మేడారంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ములుగు మండలంలోని 14 గ్రామాలకు సాగునీరందించేందుకు రూ. 200 కోట్లు సీఎం మంజూరు చేయగా సంబంధిత పనుల ప్రక్రియ కొనసాగుతున్నది.
రామప్ప సరస్సు పూర్తి స్థాయి నీటి మట్టం 35 ఫీట్లు కాగా, గత వానకాలంలో పూర్తిస్థాయిలో నిండి నెల రోజుల పాటు మత్తడి పడింది. ప్రస్తుతం గోదావరి జలాలను ఇందులోకి తరలిస్తుండడంతో 365 రోజులు సరస్సు జలకళతో కనువిందు చేస్తున్నది. సాగు, తా గుకు సరస్సు నీటిని వినియోగిస్తున్నారు. తాగునీటి అవసరాల కోసం ఫిల్టర్ బెడ్‌ను ఏర్పాటు చేయగా మిషన్ భగీరథ కింద 239 ఎంసీఎఫ్‌టీలు వినియోగించనున్నారు. రామప్ప పరిధిలో వెంకటాపూర్, ములు గు, గణపురం మండలాల్లోని పలు గ్రామా ల్లో అధికారికంగా 5,150 ఎకరాల ఆయకట్టుకు నీరందుతుండగా అనధికారంగా మరో 5 వేల ఎకరాలు సాగవుతున్నది.