ఏటూరునాగారం, జనవరి 11 : మేడారం మహా జాతర సందర్భంగా చేసే అభివృద్ధి పనుల్లో గిరిజనులకు భాగస్వామ్యం కల్పించాలని గిరిజన సంఘాల ప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరారు. గురువారం ఉమ్మడి వరంగల్ పరిధిలోని గిరిజన సంఘాల ప్రతినిధులతో ఐటీడీఏ పీవో అంకిత్ మేడారం జాతర నిర్వహణపై సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిజన సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ జాతర నిర్వహణలో ఆదివాసీ సంఘాలు, పూజారుల పాత్ర చాలా కీలకమైందని, అభివృద్ధి పనుల్లో గిరిజనులకు భాగస్వామ్యం కల్పించాలని కోరారు. మద్యం, కొబ్బరి, బెల్లం దుకాణాలు ఆదివాసీ సంఘాలు, పూజారులకు మాత్రమే కేటాయించాలన్నారు.
గిరిజనేతరులకు దుకాణాల కేటాయింపు, అభివృద్ధి పనులు అప్పగించొద్దన్నారు. ప్రభుత్వం ఆమోదించిన ధరల ప్రకారం ఆదివాసీ సంఘాలకు మద్యం షాపులు కేటాయించాలన్నారు. మద్యం షాపులు నడిపేందుకు వారం మాత్రమే గడువు ఇస్తున్నారని, కనీసం 15 రోజులు అనుమతి ఇవ్వాలన్నారు. మేడారం ట్రస్టుబోర్డు నియామకంలో గిరిజనేతరులను నియమించొద్దని కోరారు. ప్రతి జాతర సమయంలో ఇలవేల్పుల సమ్మేళనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నదని, ఇందుకు అవసరమైన బడ్జెట్ కేటాయించాలన్నారు. గిరిజన సంస్కృతికి మినహా జాతర సమయంలో నిర్వహించే చారిట బుల్ ట్రస్టులకు అనుమతించవద్దన్నారు. మేడారంలో ఆదివాసీ భవన్ నిర్మాణానికి బడ్జెట్ కేటాయించాలని కోరారు. గిరిజన యువతకు మేడారంలో డిపార్ట్మెంటు ద్వారా చేపట్టే పనులు ఇవ్వాలన్నారు. ఐటీడీఏ ద్వారా ఉపాధి రుణాలు మంజూరు చేయాలని కోరారు. అమ్మవార్లను గద్దెలకు తీసుకవచ్చే సమయంలో రోప్ పార్టీని ఆదివాసీ పోలీస్ అధికారులు మాత్రమే నిర్వహించాలని కోరారు.
పీవో అంకిత్ మాట్లాడుతూ ఆదివాసీ సంఘాలు అందించిన సలహాలు సూచనలతో మేడారం జాతర సజావుగా సాగే విధంగా ఏర్పాట్లు చేస్తామన్నారు. ఐటీడీఏ స్థాయిలో తీర్చే సమస్యలను పరిష్కరించి, ఇతర సమస్యలను ఉన్నతాధికారులకు సిఫారసు చేస్తామన్నారు. మేడారం జాతరలో పాల్గొనే ఆదివాసీ సంఘాలకు గ్రీన్ టీ షర్టులు అందజేస్తామని తెలిపారు. సమావేశంలో ఏపీవో వసంతరావు, ఏవో దామోదర్‌స్వామి, రాజ్‌కుమార్, మేనేజర్ శ్రీనివాస్, పెసా కో ఆర్డినేటర్ ప్రభాకర్, జియాలజిస్టు కిశోర్, పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు, సంఘాల నాయకులు దాట్ల నాగేశ్వర్రావు, పొడెం బాబు, పొడెం రత్నం, కొప్పుల రవి, పొదెం కృష్ణ ప్రసాద్, మైపతి అరుణ్‌కుమార్, కే లక్ష్మణ్‌రావు, సుభద్ర, సుధాకర్, గొప్ప సమ్మారావు, కబ్బాక శ్రావణ్, దబ్బగట్ల సుమన్, కొము రం రామ్మూర్తి, పొడె శోభన్ పాల్గొన్నారు.