విపత్తులతో పంట నష్టపోయిన రైతులకు రాష్ట్ర సర్కారు అండగా నిలిచింది. మార్చి, ఏప్రిల్‌లో అకాల వర్షాలతో భారీగా పంట నష్టం జరుగగా, ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ విడుదల చేసింది. జనగామ జిల్లాకు రూ.36 కోట్లు, హనుమకొండకు రూ.9 కోట్లు, మహబూబాబాద్‌కు 8.98 కోట్లు, వరంగల్‌కు రూ.2 కోట్లు, ములుగు జిల్లాకు రూ.25.31 లక్షలు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు రూ.5 లక్షల చొప్పున నిధులను మంజూరు చేసింది. ఉమ్మడి జిల్లాలో 42,120 మందికి లబ్ధి చేకూరనుండగా, త్వరలోనే రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.
వరంగల్, జూలై 10(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : యాసంగిలో అకాల వర్షాలు, రాళ్ల వానలతో పంట నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. పంట నష్టపోయిన వారికి ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చింది. ఎకరాకు రూ.10 వేల చొప్పున పంట నష్టోయిన రైతులకు విడుదల చేసింది. జనగామ జిల్లాలో ఎక్కువ పంట నష్టం జరిగింది. ఇక్కడ ఇన్పుట్ సబ్సిడీ మొత్తం ఎక్కువ మంజూరైంది. ఈ జిల్లాలోని 20,160 వేల మంది రైతులకు రూ.36.69 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది.
హనుమకొండ జిల్లాకు రూ.9.74 కోట్లు, మహబూబాబాద్ జిల్లాకు రూ.8.98 కోట్లు, వరంగల్ జిల్లాకు రూ.2.94 కోట్లు, ములుగు జిల్లాకు రూ.25.31 లక్షలు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు రూ.5 లక్షల చొప్పున నిధులను మంజూరు చేసింది. రైతుల వారీగా నష్టం వివరాల ఆధారంగా ఈ నిధులను వారి అకౌంట్లలో జమ చేసేలా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. జనగామ జిల్లాలో 20,160 మంది రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందనున్నది. హనుమకొండ జిల్లాలో 9,745 మందికి, మహబూబాబాద్ జిల్లాలో 8,986 మందికి, వరంగల్ జిల్లాలో 2,945 మందికి, ములుగు జిల్లాలో 233 మందికి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 51 మంది రైతులకు పరిహారం అందనున్నది.
సర్వే ఆధారంగా..
ప్రకృతి విపత్తులు ఈసారి అన్నదాతలను బాగా దెబ్బతీశాయి. యాసంగి సీజన్లో మార్చి 22 నుంచి ఏప్రిల్ 27 మధ్య అకాల వర్షాలు, రాళ్ల వానలతో భారీగా పంట నష్టం జరిగింది. వరి పంట ఎక్కువ విస్తీర్ణంలో దెబ్బతిన్నది. మక్కజొన్న, మామిడి, కూరగాయల పంటలకు నష్టం జరిగింది. పంట నష్టం నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా రైతుల వద్దకు వచ్చి భరోసా కల్పించారు. మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. విపత్తులతో పంట నష్టపోయిన రైతులకు ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీ మొత్తాన్ని ఎకరాకు రూ.10 వేలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. పంట నష్టపోయిన ప్రతి రైతుకు ఇన్పుట్ సబ్సిడీ ఇస్తామని చెప్పారు. అనంతరం వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులు పంట నష్టంపై సర్వే నిర్వహించారు. గ్రామాల వారీగా పంటలు, రైతుల వివరాలను సేకరించారు. రెండుమూడుసార్లు పరిశీలించి పంట నష్టం వివరాలను పొందుపరిచారు. ఈ వివరాల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం పంట నష్టపోయిన రైతులకు నిధులు మంజూరు చేసింది.