హనుమకొండ, నవంబర్ 9 : ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. హనుమకొండ జిల్లాలో ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ రైతుల ట్రాక్టర్లను ధాన్యం రవాణాకు వినియోగిస్తున్నారు. సివిల్ సప్లయ్ అధికారుల హెచ్చరికలు ఖాతరు చేయడం లేదు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని బస్తాల్లో నింపిన వెంటనే రైస్‌మిల్లుకు తరలించే బాధ్యత పూర్తిగా నిర్వాహకులదే అయినప్పటికీ వాటిని పట్టించుకోవడం లేదు. అయితే ఓ మండల కేంద్రం నిర్వాహకులు, సివిల్ సప్లయి అధికారికి మధ్య ధాన్యం రవాణా చేసే విషయంలో వివాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తున్నది.
కొనుగోలు కేంద్రాల నుంచి రైస్ మిల్లలకు ధాన్యం తరలించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాంట్రాక్టు వాహనాలను మాత్రమే వినియో గించాలి. రైతులకు సంబంధించిన ట్రాక్టర్లు, ఇతర వాహనాల్లో ధాన్యం తరలించొద్దు. ఒకవేళ రవాణా చేసినా చార్జీలు చెల్లించరు. నిబంధనలు ఉల్లంఘిస్తున్న కొందరు కొనుగోలు కేంద్రాల నిర్వాహకుల వ్యవహారంపై పలువురు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 161 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా, వీటిలో 71 సెంటర్లు ప్రారంభించారు. 24 కేంద్రాల్లోనే కొనుగోళ్లు జరుపుతున్నారు. ధాన్యం రవాణాకు సంబంధించి 14 మండలాలను ఐదు సెక్టార్లుగా విభజించారు. ఒక్కొక్క సెక్టార్‌కు ఒక కాంట్రాక్టర్‌కు కేటాయించారు.
కొనుగోలు కేంద్రాల నుంచి రైస్ మిల్లులకు సివిల్ సప్లయ్ కాంట్రాక్టర్ల వాహనంలోనే ధాన్యం తరలించాలి. ధాన్యం రవాణా చేసే బాధ్యత కేంద్రాల నిర్వాహకులదే. కొందరు రైతుల ట్రాక్టర్లు, వాహనాల ద్వారా ధాన్యం రవాణా చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. రైతులకు రవాణా చార్జీలు చెల్లించం. ఎక్కడైనా కేంద్రం లో రవాణాకు ఇబ్బంది జరిగే నా దృష్టికి తీసుకొస్తే సదరు కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకుంటాం.
– మహేందర్, డీఎం, సివిల్ సప్లయ్, హనుమకొండ జిల్లా