హనుమకొండ, ఏప్రిల్ 9 : ఇప్పటివరకు తహసీల్దార్ కార్యాలయాలకు పరిమితమైన రిజిస్ట్రేషన్ స్లాట్ బుకింగ్ విధానం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఇందుకోసం ప్రత్యేకంగా సాఫ్ట్వేర్ రూపొందించింది. ప్రతి ఉమ్మడి జిల్లా పరిధిలో రెండు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయగా ఉమ్మడి వరంగల్‌లో 13 ఆఫీసులకు గాను వరంగల్ రూరల్, ఖిలా వరంగల్ కార్యాలయాలను పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు.
ఆయాచోట్ల నేటి నుంచి స్లాట్ బుకింగ్ విధానం అమలుకు ఏర్పాట్లు చేసినట్లు జిల్లా రిజిస్ట్రార్ డి. ఫణిందర్ తెలిపారు. ప్రస్తుతం రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో స్లాట్, నాన్ స్లాట్ విధానం అమలులో ఉంది. అయితే ఇక నుంచి స్లాట్ బుకింగ్‌ను తప్పనిసరి చేసింది రాష్ట్ర ప్రభుత్వం. స్లాట్ బుకింగ్ విధానం పైలట్ ప్రాజెక్టుల్లో విజయవంతమైతే రాష్ట్రవ్యాప్తంగా అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అమలు చేయనున్నారు. దీని వల్ల క్రయ, విక్రయదారులు గంటల తరబడి వేచి ఉండకుండా సమయానికి వచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు.