మణుగూరు టౌన్, జనవరి 13: బీఆర్ఎస్పై కాంగ్రెస్ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు స్పష్టంచేశారు. ఇందులో భాగంగానే బీఆర్ఎస్ కార్యాలయాలపైనా, నాయకులపైనా, ప్రజాప్రతినిధులపైనా ఇలాంటి దాడులు చేయిస్తోందని తేల్చిచెప్పారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై దాడి, అరెస్టు వంటివి కూడా ఇందులో భాగమేనని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అరెస్టును తాను తీవ్రంగా ఖండదిస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రజలకు కూడా స్వేచ్ఛ లేకుండా పోయిందని అన్నారు. కౌశిక్‌రెడ్డి ఒక ప్రజాప్రతినిధి అయినప్పటికీ.. అతడి హోదాను కూడా లెక్కచేయకుండా పోలీసులతో అరెస్టు చేయిండచం సబబు కాదని అన్నారు. ఎమ్మెల్యేపై దాడి కేసులో పోలీసులు అరెస్టు చేయడం, హైదరాబాద్ నుంచి కరీంనగర్‌కు తరలించడం దారుణమని అన్నారు.