స్వరాష్ట్రంలో వైద్య సేవలు ఎంతో మెరుగయ్యాయి. ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది ములుగు జిల్లా ప్రభుత్వ దవాఖాన. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ వంద పడకలకు అప్‌గ్రేడ్ చేశారు. అధిక నిధులు కేటాయించి అభివృద్ధి చేశారు. సూపరింటెండెంట్‌తో మరో నలుగురు స్త్రీల వైద్య నిపుణులు, నలుగురు మత్తుమందు నిపుణులు, ఒక పిల్లల డాక్టర్, 20 మంది సిబ్బందిని ఏర్పాటు చేశారు. పైగా కేసీఆర్ కిట్టు అమలు చేస్తుండగా ఇందులో ఎనిమిదేళ్లలో రికార్డు సంఖ్యలో కాన్పులు జరిగాయి. జూలై వరకు 10,567 ప్రసవాలు జరిగాయి. ఇందులో 4,229 నార్మల్, 6,338 సిజేరియన్. సగటున రోజూ 5 ప్రసూతి కేసులతో రాష్ట్రంలోనే ఈ దవాఖాన రికార్డు స్పష్టించింది. నవజాత శిశువులకు సైతం వైద్యసేవలు అందిస్తున్నారు. ఈ క్రమంలో నిరుపేదలపై ఆర్థికభారం పూర్తిగా తప్పింది. డెలివరీకి ముందు, ఆతర్వాత అమ్మ ఒడి వాహనాల సేవలను వినియోగించుకుంటున్నారు.
ములుగు, జూలై 29 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్రం వస్తే ఏం వస్తుందన్న వారికి ములుగు జిల్లా ప్రభుత్వ దవాఖానలో అందుతున్న వైద్యసేవలు సమాధానంగా నిలుస్తున్నాయి. స్వరాష్ట్రంలో ఎనిమిదేళ్లలో ఈ దవాఖానలో రికార్డు సంఖ్యలో కాన్పులు జరిగాయి. 2014 నుంచి 2022 జూలై వరకు 10,567 ప్రసవాలు జరిగాయి. ఇందులో 4,229 సాధారణ ప్రసవాలు కాగా, 6,338 సిజేరియన్ ఉన్నాయి. 2021లో అత్యధికంగా 1,920 ప్రసవాలు జరగ్గా, ప్రస్తుత ఏడాది జూలై వరకు 972 ప్రసవాలు జరిగాయి. సగటున రోజూ 5 ప్రసూతి కేసులతో రాష్ట్రంలోనే ములుగు జిల్లా ప్రభుత్వ దవాఖాన రికార్డు స్పష్టించింది. స్వరాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం సర్కారు వైద్య రంగాన్ని బలోపేతం చేసింది. ప్రభుత్వ దవాఖానలకు అధిక నిధులు కేటాయించింది. దీంతో వైద్యసేవలు మెరుగుపడ్డాయి. కేసీఆర్ కిట్టు పథకం అమలు తర్వాత ములుగు ప్రభుత్వ దవాఖానలో కాన్పుల సంఖ్య పెరుగుతోంది. జిల్లా వ్యాప్తంగా 15పీహెచ్‌సీలతోపాటు ఏటూరునాగారం, వెంకటాపురం (నూగూరు) సామాజిక దవాఖానల్లోనూ అత్యధికంగా ప్రసవాలు జరుగుతున్నాయి.
వంద పడకలకు అప్‌గ్రేడ్
ములుగు ప్రభుత్వ దవాఖాన జిల్లాలోని తొమ్మిది మండలాల ప్రజలకు పెద్ద దిక్కుగా మారింది. రాష్ట్ర వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ములుగు దవాఖాన గతంలో 30 పడకల స్థాయిలో ఉండేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత సీఎం కేసీఆర్ వంద పడకలకు అప్‌గ్రేడ్ చేశారు. అన్ని విభాగాల్లో వైద్యసేవలను మెరుగుపరిచారు. కలెక్టర్ ఎస్ కృష్ణ ప్రత్యేక శ్రద్ధ వహించి తన నిధుల నుంచి అధికంగా కేటాయిస్తూ మౌలిక వసతులతోపాటు వైద్యపరికరాలను సమకూర్చారు. దవాఖాన సూపరింటెండెంట్ జగదీశ్వర్ స్త్రీ వైద్య నిపుణుడు కావడంతో రిస్క్ డెలివరీ కేసులను సైతం టేకప్ చేస్తున్నారు. మరో నలుగురు స్త్రీ వైద్య నిపుణులు, నలుగురు మత్తుమందు ఒక పిల్లల డాక్టర్, 20మంది వైద్య సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తున్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా నవజాత శిశువులకు సైతం వైద్యసేవలు అందించి ప్రభుత్వం నుంచి వచ్చే ఆరోగ్యశ్రీ నిధులతో దవాఖాన అభివృద్ధికి వైద్యులు కృషిచేస్తున్నారు.
పేదలకు తప్పిన ఆర్థికభారం
ఎనిమిదేళ్లలో జిల్లా జరిగిన ప్రసవాలతో పేదలపై ఆర్థికభారం తప్పింది. మందులు, వైద్య ఖర్చులు, కేసీఆర్ కిట్లతో రూ.50కోట్ల విలువైన వైద్యసేవలు అందాయి. గర్భందాల్చినప్పటి నుంచి అంగన్వాడీ టీచర్లు, ఆశవర్కర్లు, వైద్యసిబ్బంది సాయంతో నెలనెల పరీక్షలకు అమ్మఒడి వాహనాల ద్వారా జిల్లా దవాఖానకు తీసుకువచ్చి వైద్య పరీక్షలు చేసి, మందులను ఉచితంగా అందజేస్తున్నారు. డెలివరీ సమయానికి ముందురోజే ప్రభుత్వ దవాఖానలకు తరలించి ప్రత్యేక వైద్యసేవలను అందించి, కాన్పు అయ్యాక తల్లికి, బిడ్డకు ప్రత్యేక వ్యాక్సిన్లను అందిస్తున్నారు. డిశ్చార్జి అయ్యే రోజు కేసీఆర్ కిట్టును సైతం అందిస్తున్నారు. ములుగు దవాఖానలో గర్భిణులకు వారానికి మూడు రోజులు ప్రత్యేకంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తుండగా ఒక్క రోజుకు 110 నుంచి 150 మంది గర్భిణులకు వైద్యపరీక్షలను నిర్వహించి స్కానింగ్‌తోపాటు మూత్ర పరీక్షలను నిర్వహిస్తూ పౌష్టికాహారం లోపం లేకుండా మందులను సైతం అందిస్తున్నారు.
కలెక్టర్ ప్రత్యేక చొరవ
స్వరాష్ట్రంలో ప్రభుత్వం వైద్య రంగాన్ని బలోపేతం చేసింది. గర్భిణులు, రోగులకు కార్పొరేట్ వైద్యాన్ని ఉచితంగా అందిస్తోంది. కలెక్టర్ కృష్ణ ఆదిత్య ప్రత్యేక చొరవతో ములుగు ప్రభుత్వ దవాఖానకు నిధులు కేటాయించారు. కలర్ స్కానింగ్ మిషన్, సీఆర్మ్ఎక్స్రే మిషన్ ఏర్పాటు చేశారు. వైద్యులు, వైద్య సిబ్బంది కొరత లేకుండా చేశారు. డెలివరీ కేసులను వరంగల్ ఎంజీఎంకు రెఫర్ చేయకుండా ఇక్కడే చేస్తున్నాం.
– డాక్టర్ జగదీశ్వర్, జిల్లా సూపరింటెండెంట్