మార్చిలోనే మాడు పగిలేలా ఎండలు దంచికొడుతున్నాయి. సీజన్ ఆరంభంలోనే భానుడు ఉగ్రరూపం దాల్చుతుండడంతో రానురాను పరిస్థితి మరింత తీవ్రంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. జిల్లాలో ఈ నెల 15న 40డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదై దడపుట్టించింది. ఉదయం 7నుంచే నిప్పులు కురుస్తుండడంతో రోడ్లన్నీ నిర్మానుష్యమవుతున్నాయి. ముఖ్యంగా మధ్యాహ్నం బయటకు రావాలంటే ప్రజల్లో వణుకు పుడుతున్నది. ఇప్పుడే ఎండ తీవ్రతకు పొద్దున నుంచి సాయంత్రం దాకా ప్రధాన రహదారులు వెలవెలబోతున్నాయి. రాష్ట్రంలో వడగాలులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ చెబుతున్న క్రమంలో జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. పిల్లలు, వృద్ధుల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు.
వరంగల్, మార్చి 17(నమస్తేతెలంగాణ) : జిల్లా లో ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. మునుపెన్నడూ లేని రీతిలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు మార్చి మూడో వారంలోనే నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తున్నది. ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఎండల తీవ్రత బాగా పెరగడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పగలు బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంటున్నది. గత మూడేళ్లలో మార్చి 1 నుంచి 17వ తేదీ వరకు పరిశీలిస్తే ఈ ఏడాది ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పెరిగాయి. 2020 మార్చి 17వ తేదీ వరకు 34 డిగ్రీలు దాటలేదు. 2021లో 36 డిగ్రీలు నమోదైంది. ఈ ఏడాది నలభై డిగ్రీలకు చేరింది. గత మంగళవారం జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు నమోదైనట్లు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం అధికారులు వెల్లడించారు. 2020, 2021, 2022 సంవత్సరం మార్చి లో నమోదైన ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే 2020లో మార్చి 1 నుంచి 17వ తేదీ వరకు 30 నుంచి 34 డిగ్రీలు నమోదయ్యాయి. 3, 17 తేదీల్లో మాత్రమే 34 డిగ్రీలు నమోదైనట్లు అధికారులు తెలిపారు. 2021 మార్చిలో 32.5 నుంచి 36 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు చెప్పారు. 7వ తేదీన 36 డిగ్రీలు నమోదైనట్లు ప్రకటించారు. ఈ ఏడాది ఇప్పటికే నలభైకి చేరడం ఆందోళన కలిగిస్తున్నది. 1 నుంచి 17వ తేదీ వరకు 33.5 నుంచి 40 డిగ్రీలు నమోదైంది. ఈ నెల 1, 2, 11 తేదీల్లో 35, 3న 33.5 డిగ్రీలు, 4, 5,12, 13, 14 తేదీల్లో 35.5 డిగ్రీలు, 6, 7 తేదీల్లో 34డిగ్రీలు, 8, 10 తేదీల్లో 34.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైతే 15న అత్యధికంగా 40 డిగ్రీలు నమోదైం ది. బుధవారం 38, గురువారం 39 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ నెల లో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైతే ఇదే మార్చి 15న 2020లో 33 డిగ్రీలు, 2021లో కూడా 33 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కాగా, ఈ ఏడాది మార్చి 15న అనూహ్య రీతిలో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
