ఖిలావరంగల్, ఏప్రిల్ 21: గత నెల మార్చికి సంబంధించిన దొడ్డు బియ్యం నిల్వలను రేషన్ షాపుల నుంచి సత్వరమే గోదాములకు తరలించాలని కోరుతూ జిల్లా రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ప్రజావాణిలో అదనపు కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. సన్న బియ్యం పంపిణీ చేస్తున్న నేపథ్యంలో దొడ్డు బియ్యం నిల్వలను షాపులలో ఉంచడం కష్టతరంగా మారిందని తెలిపారు.
ఎలుకలు, పందికొక్కులు బెడదతో తరుగు ఏర్పడడమే కాక బియ్యం, తుట్టెలు కట్టి నాణ్యత కోల్పోతుందని తెలిపారు. ప్రధానంగా రేషన్ షాపులలో దొడ్డు బియ్యం వల్ల సన్న బియ్యం నిల్వ చేయడానికి స్థలం సరిపోవడం లేదని అలాగే దొడ్డు బియ్యం బస్తాలు లబ్ధిదారులకు కనిపించడంతో డీలర్ల పై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి దొడ్డు బియ్యం నిల్వలను గోదాములకు తరలించే విధంగా చర్యలు తీసుకోవాలని వినతి పత్రంలో కోరారు.