ఖిలావరంగల్ : రాష్ట్ర రేషన్ డీలర్లకు ఏప్రిల్ నుండి ఆగష్టు వరకు 5నెలల కమీషన్ డబ్బులు చెల్లించకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నా మని వరంగల్ జిల్లా రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం బాధ్యులు వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్య శారదకు వినతిపత్రం సమర్పించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం మ్యానిఫెస్టోలో పెట్టిన రూ.5,000 గౌరవ వేతనం, కమీషన్ పెంపును వెంటనే ప్రకటించాలని తెలిపారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని నెరవేర్చకపోవడంతో వచ్చేనెల 5వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క రోజు రేషన్ షాప్ లను బంద్ చేస్తున్నట్లు వినతిపత్రంలో పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో రేషన్ డీలర్లుగా పనిచేస్తున్న మాకు ఏప్రిల్ నెల నుండి ఆగష్టు నెల వరకు 5 నెలల కమీషన్ డబ్బులు రాక ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. సకాలంలో కమీషన్ డబ్బులు చెల్లించకపోతే వినాయక చవితి, బతుకమ్మ, దసరా పండుగలను కూడా జరుపుకోలేని పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర కమీషన్, రాష్ట్ర కమీషన్ అని వేరు వేరుగా కాకుండా ఒకే కమీషన్ డీలర్లకు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
అలాగే కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో కనీస గౌరవ వేతనం రూ. 5,000, కమీషన్ రూ.300 లకు పెంచి అందిస్తామని ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని వినతి పత్రంలో కోరారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం నెక్కొండ మండలం అధ్యక్షుడు వెంకటనారాయణ, గీసుకొండ అధ్యక్షుడు శంకర్రావు, మాజీ జిల్లా అధ్యక్షుడు గజ్జి గోవర్ధన్, నారాయణరెడ్డి, మంద మహేందర్, నూనె శంకర్, కోరే కుమార్, సింగం కుమార్, మనోజ్ దత్తు తదితరులున్నారు.