వెంకటాపూర్, మే 12 : రామప్ప దేవాలయాన్ని ఎన్నిసార్లు చూసినా తనివి తీరదని, అద్భుతమైన శిల్పకళకు నెలవైన ప్రపంచ వారసత్వ కట్టడమున్న ప్రాంతంలో ఓపెన్‌కాస్ట్ గనులను ఏర్పాటు చేస్తామంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోమని జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. సోమవారం వెంకటాపూర్ మండలంలోని రామప్ప ఆలయాన్ని ఆమె సందర్శించగా ఆలయ అర్చకులు హరీశ్‌శర్మ, ఉమాశంకర్‌లు స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేసి, తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఆలయ మండపంలో ఈవో శ్రీనివాస్, అర్చకులు స్వామి వారి శేషావస్ర్తాలను బహూకరించారు. అనంతరం మాట్లా డుతూ రామప్ప ఆలయానికి 5 కి.మీల దూరంలో ఓపెన్‌కాస్ట్ మైన్ ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తే కేసీఆర్ ఆ ప్రయత్నాన్ని 2012లోనే తీవ్రంగా వ్యతిరేకించారని గుర్తుచేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మళ్లీ ఓపెన్ కాస్ట్ ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. యునెస్కో గుర్తింపు పొందిన ఆలయ అభివృద్ధిపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు.
కేసీఆర్ ప్రభుత్వంలోనే రామప్ప ఆలయానికి ప్రపంచ వారసత్వ హోదా తెచ్చుకున్నామని, ప్రస్తుత ప్రభుత్వం అప్పటి పనులను పెండింగ్‌లో పెట్టిందని, అందాల పోటీల నేపథ్యంలో పై మెరుగులు దిద్దుతున్నారన్నారు. రైతులు, ప్రజలు చనిపోతున్నా మంత్రి సీతక్క పట్టించుకోవడం లేదని, ప్రజలపై ప్రతిపక్షలంలో ఉన్నప్పటి ప్రేమ అధికారంలోకి వచ్చాక లేదని విమర్శించారు. కొత్తగా ఒక్క స్కీం కూడా ఇవ్వలేదని, ఉన్న పింఛన్లు పెంచలేదని గత పదేళ్లలో చేసిన అభివృద్ధి తప్ప ఈ ఏడాదిన్నరలో కొత్తగా ఏమీ లేదన్నారు. దేశ సరిహద్దులో ఒకవైపు యుద్ధం జరుగుతుంటే మన సీఎం అందాల పోటీలకు హాజరయ్యారని.. అందాల పోటీలపై ఉన్న శ్రద్ధ రాష్ట్రంపై లేదన్నారు.
నాంచారమ్మ ఆలయ నిర్మాణానికి సహకరిస్తాం
వెంకటాపూర్ మండలం రామంజాపూర్ గ్రామంలోని ఎరుకల నాంచారమ్మ ఆలయ నిర్మాణానికి తమ వంతు సహకారం అందిస్తామని ఎమ్మెల్సీ కవిత హామీ ఇచ్చారు. నాంచారమ్మ జాతరకు హాజరై తల్లికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఎరుకలతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఎరుకలతో ఎరుక(జోస్యం) చెప్పించుకున్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ జాతర కోసం ఆరు గంటలు పాటు ప్రయాణించి వచ్చానని, నాంచారమ్మ ఆలయ నిర్మాణంతో పాటు జాతరకు ప్రభుత్వం తోడ్పాటునందించాలని కోరారు. బీఆర్ఎస్ హయాంలో నాంచారమ్మ జాతరకు అభివృద్ధికి దృష్టి పెట్టామని తెలిపారు.
ఎరుకల కులం వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు కేసీఆర్ ఎంటర్ప్రెన్యూర్ పథకాన్ని తీసుకువచ్చారని చెప్పారు. ఆమె వెంట బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ పోరిక గోవింద్‌నాయక్, మాజీ జడ్పీటీసీలు సకినాల భవాని, గై రుద్రమదేవి అశోక్, మాజీ ఎంపీటీసీ పోశాల అనితావీరమల్లు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు లింగాల రమణారెడ్డి, జిల్లా నాయకులు జంపన్న, పోరిక విజయ్‌రామ్ నాయక్, మల్క రమేశ్, మాజీ సర్పంచ్‌లు జగన్మోహన్రావు, కుమారస్వామి, నాయకులు అంతటి రాము, ప్రభాకర్‌రావు, రవీందర్, రాజు, సత్యం పాల్గొన్నారు.
మళ్లీ బీఆర్ఎస్దే అధికారం
జాతరకు వచ్చిన కవితకు ఎరుకలు సోది చెబుతూ భవిష్యత్‌లో బీఆర్ఎస్ పార్టీదే అధికారమని, అధికారంలోకి వచ్చాక ఎరుకల నాంచారమ్మ గుడిని పునర్నిర్మాణం చేయాలని కేతిరి సిందూజ, పాలకుర్తి వైష్ణవిలు సోది చెప్పారు. అందుకు ఆమె స్పందిస్తూ తప్పకుండా ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని, ఆలయానికి ఎల్లవేళలా సహకారం అందిస్తామని మాటిచ్చారు.