వరంగల్, అక్టోబర్ 22(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ ఎన్నికల తొలి జాబితాపై అసంతృప్తులు మొదలయ్యాయి. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం టికెట్‌పై ఆశలు పెట్టుకున్న ఏనుగుల రాకేశ్‌రెడ్డి వర్గం ఏడుపులు మొదలు పెట్టింది. ఆదివారం మధ్యాహ్నం బీజేపీ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించారు. జనగామకు ఆరుట్ల దశమంత్‌రెడ్డి, స్టేషన్ ఘన్‌పూర్‌కు జీ విజయరామారావు, పాలకుర్తిలో లేగ రామ్మోహన్‌రెడ్డి, డోర్నకల్‌కు భూక్యా సంగీత, మహబూబాబాద్‌లో జాటోతు హుస్సేన్ నాయక్, వరంగల్ పశ్చిమలో రావు పద్మ, వరంగల్ తూర్పులో ఎర్రబెల్లి ప్రదీప్‌రావు, వర్ధన్నపేటకు కొండేటి శ్రీధర్, భూపాలపల్లికి చందుపట్ల కీర్తిరెడ్డి, హుజూరాబాద్‌కు ఈటల రాజేందర్, ఇల్లందుకు రవీంద్రనాయక్, భద్రాచలంలో కుంజా ధర్మరావుకు టికెట్లు ఇచ్చింది. అత్యధిక స్థానాల్లో టికెట్లకు పోటీ లేకపోవడంతో పార్టీ ఈ స్థానాలను ప్రకటించింది. అభ్యర్థులు అసలే లేని పరిస్థితి ఉన్న నర్సంపేట, పరకాల, ములుగుతోపాటు హుస్నాబాద్, మంథని స్థానాలను పెండింగ్‌లో పెట్టింది. ఈ స్థానాల కోసం ఇతర పార్టీల్లోని నేతలు ఎవరైనా వస్తారా అనే ఆలోచనతో ఉన్నట్లు తెలిసింది. బీజేపీలో ఇతర పార్టీల నుంచి చేరిన వారికే ఎక్కువ స్థానాల్లో అవకాశం ఇచ్చారు. వరంగల్ తూర్పు అభ్యర్థి ఎర్రబెల్లి ప్రదీప్‌రావు ఇటీవలే బీజేపీలో చేరారు. పాలకుర్తి బీజేపీ అభ్యర్థి లేగ రామ్మోహన్‌రెడ్డి ఎవరనేది తెలియని పరిస్థితి ఉన్నది. ఇల్లందు, భద్రాచంలోనూ అభ్యర్థులు ఇలాగే ఉన్నారు. డోర్నకల్ అభ్యర్థి భూక్యా సంగీత వారం క్రితమే చేరారు. నర్సంపేట, పరకాల, ములుగు, హస్నాబాద్, మంథనిలోనూ సొంత నాయకులు లేరు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ఈ స్థానాల్లో అవకాశం ఇచ్చే పరిస్థితి ఉన్నది.