స్టేషన్‌ఘన్‌పూర్, ఆగస్టు 1 : రాష్ట్రవ్యాప్తంగా పలు గురుకులాలు, వసతి గృహల్లో ఇటీవల జరుగుతున్న ఫుడ్ పాయిజన్ ఘటనల నేపథ్యంలో విద్యార్థినుల ఆరోగ్యంపై తగిన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని మాజీ ఎమ్మెల్యే రాజయ్య అన్నారు. శుక్రవారం జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లోని కేజీబీవీ వసతి గృహాన్ని ఆయన ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థినులకు అందిస్తున్న భోజనాన్ని, వసతులను పరిశీలించారు.
కిచెన్‌ను తనిఖీ చేసి బియ్యం నిల్వలు, కూరగాయల స్వచ్ఛత, వంట పద్ధతులపై నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినులతో మాట్లాడి వారి ఆరోగ్యం, ఆహార నాణ్యత, వసతులపై ఆరా తీశారు. ఈ సందర్భంగా వారు సరిపోను బెడ్లు, ఆడుకోవడానికి గ్రౌండ్ లేవని, డైనింగ్ హాల్ చిన్నగా ఉండటంతో బయట కూర్చొని తినాల్సి వస్తున్నదని, వర్షం పడితే ఇబ్బందులు పడుతున్నామని, టాయిలెట్లు సరిపోవడం లేదని రాజయ్య దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాల ఆవరణలో పిచ్చి మొక్కలు పెరిగాయని, పాములు, కీటకాలతో ప్రమాదం జరిగే అవకాశం ఉందన్నారు.
పిల్లల ఆరోగ్యంపై నిర్లక్ష్యం వహిస్తే సహించబోమన్నారు. తరచూ తనిఖీలు నిర్వహిస్తామని, విద్యార్థినుల సమస్యలపై ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే తక్షణం స్పందించి పరిష్కరించాలని రాజయ్య కోరారు. ఆయన వెంట పార్టీ మండలాధ్యక్షుడు మాచర్ల గణేశ్, బీఆర్ఎస్వీ నియోజకవర్గ ఇన్చార్జి లకావత్ చిరంజీవి, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చందర్‌రెడ్డి, మాజీ సర్పంచ్ సురేశ్, ఆగారెడ్డి, మారపల్లి ప్రసాద్, గుండె మల్లేశ్, పెసరు సారయ్య, కనకం గణేశ్, గుర్రం శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.