హనుమకొండ సబర్బన్, జూన్ 15 : వానకాలం మొదలై 15 రోజులు కావస్తున్నది. ఇప్పటి వరకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో తొలకరి చినుకులు పలకరించలేదు. దీంతో వానమ్మ రాక కోసం అన్నదాత ఆకాశం వైపు ఆశగా ఎదురుచూస్తున్నాడు. ఏటా మే నెల చివరి వారంలోనే ఒకట్రెండు భారీ వర్షాలు కురవడంతో అందరూ దుక్కులు దున్ని విత్తనాలు నాటేందుకు సిద్ధం చేసేవారు. ఈ సారి అందుకు భిన్నంగా జూన్ రెండో వారం పూర్తవుతున్నప్పటికీ వాన జాడ లేదు. నైరుతి రుతుపవనాలు వస్తున్నాయని వాతావరణ శాఖ పదేపదే చెబుతున్నప్పటికీ వర్షాలు పడకపోవడంతో రైతులు నిరాశ చెందుతున్నారు.
హనుమకొండ జిల్లాలో వానకాలంలో 1.70 లక్షల ఎకరాల్లో వరి, 60 వేల ఎకరాల్లో పత్తి పంట రైతులు సాగు చేస్తుంటారు. ఇప్పటికే విత్తనాలను సైతం కొనుగోలు చేశారు. నీటి వసతి ఉన్నవాళ్లు వరి నార్లు పోసుకుంటున్నారు. నారు ఎదిగేనాటికి వర్షాలు కురిసి నాట్లు వేసుకుంటామనే ఆశాభావంతో ముందుకు సాగుతున్నారు. అయితే ఎండల తీవ్రత తగ్గకపోవడంతో మొలిచిన నారు దక్కడం లేదు. ప్రతిరోజు 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ఎండ వేడికి నారు మాడిపోతున్నది. వర్షంపై ఆధారపడి వరి పంట వేసే రైతుల నారు మడులు ఆలస్యం కానున్నాయి.

అయితే ఇటీవల కురిసిన చిన్న వర్షానికే హనుమకొండ జిల్లాలోని హనన్పర్తి, ఐనవోలు, ఆత్మకూరు, పరకాల, ధర్మసాగర్, ఎల్కతుర్తి, శాయంపేట మండలాల్లో సుమారు 10 వేల ఎకరాల్లో రైతులు ముందస్తుగానే పత్తి విత్తనాలను నాటుకున్నారు. వారం దాటుతున్నా చినుకు జాడ లేకపోవడంతో విత్తనాలు భూమిలోనే మాడిపోతున్నాయి. ఇప్పుడు వర్షం పడినా అవి మొలిచే పరిస్థితి లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీటి వసతి ఉన్న వారు మాత్రం తడులు పెడుతుండగా, ఎండ తీవ్రతతో అవి మొలకెత్తగానే మాడిపోతున్నాయి. ఈసారి ఎల్నినో ప్రభావం వల్ల తీవ్ర కరువు నెలకొంటుందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉండగా పూర్తిస్థాయిలో వర్షాలు కురిసి నేల చల్లబడిన తర్వాతనే విత్తనాలు నాటుకోవాలని వ్యవసాయశాఖ అధికారులు సూచిస్తున్నారు.
ఇప్పటి వరకు సరైన వర్షపాతం నమోదు కాలేదు. రైతులు తొందరపడొద్దు. సమృద్ధిగా వర్షాలు కురిసిన తర్వాతనే సాగు పనులు మొదలుపెట్టాలి. వరి పండించే వారు ఆగస్టు వరకు నార్లు పోసుకునే సమయం ఉంటుంది. చెరువుల్లోకి కొద్దిపాటి నీరు చేరి బావుల్లో నీటి మట్టాలు పెరిగిన తర్వాతనే నార్లు పోసుకుంటే మంచిది. ఇక పత్తి రైతులు 70 ఎంఎం వర్షపాతం కురిసిన తర్వాతే విత్తుకోవాలి.
– డాక్టర్ ఉమ్మారెడ్డి, ఏడీఆర్, ఆర్ఏఆర్ఎస్
అప్పుడప్పుడు కురిసిన చిన్న చినుకులకే అన్నదాత సాగు బాట పడుతున్నాడు. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం రామన్నగూడెంలో ఆదివారం తెల్లవారుజామున కురిసిన చిరు జల్లులకే ఓ రైతు పొసి దుక్కిలో పత్తి గింజలు పెడుతున్నాడు. వ్యవసాయ శాఖ అధికారులు వద్దని వారించినా ముందస్తుగా నాటితే చీడపీడల బాధ తప్పుతుందని రైతులు చెబుతున్నారు.
– నర్సింహులపేట, జూన్ 15