వానకాలం మొదలై రెండు నెలలు దాటుతున్నా ఇప్పటికీ ఒక్క గట్టి వాన కురవక రైతులపై కాలం పగబట్టినట్లు చేస్తున్నది. ఎప్పుడో ఒకసారి చిన్న జల్లు పడుతున్నా అదీ ఒక్కో ప్రాంతానికే పరిమితవుతున్నది. సాగునీటి నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం రైతులకు శాపంగా మారింది. ప్రాజెక్టుల నుంచి నీళ్లు విడుదల చేయకపోవడంతో వేసిన పంటలు ఎండిపోతుండడంతో పాటు వరి నాట్లు వేయలేని పరిస్థితి నెలకొంది. మొత్తంగా ఈ సీజన్లో పంటల సాగు పరిస్థితి దయనీయంగా ఉన్నది.
– హనుమకొండ, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
జూన్ 1 నుంచి వానకాలం మొదలైంది. ఉమ్మడి జిల్లాలోని వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో ఎక్కడా సాధారణ స్థాయిలోనూ వానలు పడడంలేదు. ఆరు జిల్లాల్లోనూ కురవాల్సిన దాని కంటే బాగా తక్కువ వర్షపాతం నమోదైంది. జూలై చివరి వారంలో నాలుగు రోజులు పడినా ముసురు వానలే కావడంతో ఎక్కడా నీళ్లు రాలేదు. చెరువులు, బావుల్లో జల సంపద పెరగలేదు.
మే చివరలో, జూన్ మొదట్లో కురిసిన కొద్దిపాటి వా నలకు విత్తనాలు వేసిన పంటలు ఇప్పు డు ఎండిపోతున్నాయి. పత్తి మొక్కలు అస్సలు పెరగడంలేదు. మక్కజొ న్న, పెసర, మినుము, వేరుశనగ, నువ్వులు.. ప్రతి పంట పరిస్థితి ఇలాగే ఉన్నది. మిరప తోటల కోసం నారు సిద్ధం చేసుకునే పరిస్థితి లేకుండా పోతున్నది. జూలైలో వానలు కురిసి నీటి వనరులు పైకి వస్తా యి. ఈ సీజన్లో దీనికి విరుద్ధంగా జరుగుతున్నది.
గతేడాది కాల్వల నుంచి నీళ్లు ఇయ్యకపోవడంతో బావులు, బోర్లలో నీటి వనరులు లేకుండాపోయాయి. వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, జనగామ జిల్లాల్లో నీటి జల దాదాపు మీట రు లోపలికి పోయాయి. మూడేండ్ల క్రితం వరకు వా నలు లేకపోయినా నీటి వనరుల ఆసరాతో పంటల సాగు జరిగేది. ఇప్పుడు చెరువుల్లో నీళ్లు లేవు. బోర్లు, బావుల్లో నీళ్లు లేకుండా పోతున్నాయి. కాల్వ నుంచి చెరువులకు నీళ్లు రాకపోవడంతో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. పంటలను కాపాడుకునేందుకు రైతులు నానా పాట్లు పడుతున్నారు. తేమ లేకపోవడంతో సాగు చేసిన పంటల మొక్క లు పెరగడంలేదు. ఎక్కువ శాతం ఎండిపోతున్నాయి.
చిన్నబోతున్న చెరువులు
శాయంపేట మండలంలో 69 చెరువులకు నిండినవి పదిలోపే..
శాయంపేట, ఆగస్టు 7 : శాయంపేట మండలంలో 69 చెరువులకు పదిలోపే చెరువులు నిండాయి. మిగిలిన వాటిల్లో సగం వరకే నీళ్లు వచ్చాయి. గట్టి వానలు పడితే తప్ప అవి నిండే పరిస్థితి లేదు. ఈ క్రమంలో మండల పరిధిలో ఈ సీజన్లో 9 వేల ఎకరాల్లో వరిని సాగు చేస్తుండగా ఇప్పటి వరకు 4205 ఎకరాల్లో వరి నాట్లు పడ్డాయి. దేవుని చెరువు కింద వంద ఎకరాలకు ఆయకట్టు సాగవుతుండగా, ఈ సారి వానలు లేకపోవడతో నీళ్లు లేక వెలవెలబోతున్నది. నార్లు పోసిన రైతులు ఆందోళనలో ఉన్నారు. మళ్లీ భారీ వర్షాలు పడితే తప్ప ఖరీఫ్ గట్టెక్కేనా అన్న పరిస్థితి వారిలో నెలకొంది.
వరి సాగు లేదు
ప్రధాన పంటగా ఉన్న వరి సాగుకు ప్ర స్తుత వాతావరణం అనుకూలించడంలే దు. వరి సాగు చేసే భూములు మొత్తం ఇప్పుడు పడావుగా కనిపిస్తున్నాయి. ప్రతిసారి ఇప్పటికే నాట్లు వేసి పచ్చగా కనిపించే ప్రాంతాల్లో ఇప్పుడు నీళ్లు లేక దుక్కులు దున్నక గడ్డి పెరిగిపోతున్నది. పోసిన నారు పెరిగి అదను దాటి పోతున్నది. నీళ్లు లేకపోవడంతో రైతులు పొలాలను దున్నే పరిస్థితి లేదు. ప్రాజెక్టుల ఆయకట్టు పరిధి లోనూ నీళ్లు లేక వరి సాగు కావడంలేదు. సొంతంగా బావి, బోరు ఉన్నా నాటు వే సేందుకు అవసరమైన నీళ్లు లేవు. నార్లు ముదిరిపోయే పరిస్థితి వస్తున్నది. మరో రెండు వారాలు ఇలాగే ఉంటే… ఆ తర్వా త వానలు వచ్చినా వరి సాగు చేయలేని పరిస్థితి. నారు ముదిరిన త ర్వాత నాట్లు వేసినా పంట దిగుబడులు రావని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు.