మరిపెడ : మండలంలో శుక్రవారం తెల్లవారుజామున కురిసిన అకాల వర్షానికి మండలంలోని వీరారం గ్రామంలో ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యం రాశులు తడిసి పోయాయి. ఆరుగాలం శ్రమించి ధాన్యం అమ్ముకునే సమయంలో తడిసిపోవడంతో బాధిత రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. లారీలు, హమాలీల కొరత కారణంగా కొనుగోలు కేంద్రాల్లో పెద్ద ఎత్తున ధాన్యం రాశులు పేరుకుపోతున్నాయి. ధాన్యం కొనుగోలు కేంద్రాలను అనువైన ప్రదేశాల్లో నిర్వహించకుండా రోడ్లపై పొలాలలో నిర్వహించడం వల్ల రైతుల తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రోజుల తరబడి పడిగాపులు పడాల్సి వస్తుందని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు నిర్లక్ష్యంతో కొనుగోలు కేంద్రాలలో ధాన్యం తడిసిపోతుందని రైతులు ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి హమాలీల సంఖ్యను పెంచి త్వరగతిన ధాన్యాన్ని తరలించాలని కోరుతున్నారు.