కాజీపేట, మే 13: బెల్లంపల్లి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల మతి స్థిమితం సరిగా లేని ఓ మహిళ అదృశ్యమై కాజీపేట రైల్వే స్టేషన్లో ప్రత్యక్షం కావడంతో జీఆర్పీ సిబ్బంది చేరదీసి కుటుంబ సభ్యులకు అప్పగించిన సంఘటన మంగళవారం జరిగింది. కాజీపేట జీఆర్పీ సీఐ నరేష్ కుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కాజీపేట రైల్వే స్టేషన్ ఒకటో నెంబర్ ప్లాట్‌ఫామ్‌పై జీఆర్పీ సిబ్బంది సోమవారం విధులు నిర్వహిస్తుండగా ఓ మహిళ అనుమానాస్పదంగా కనిపించినట్లు తెలిపారు. సదరు మహిళను జీఆర్పీ ఉన్నత అధికారుల ఆదేశాలతో జీఆర్పీ స్టేషన్‌కు తరలించినట్లు చెప్పారు.
ఆ మహిళకు మతిస్థిమితం లేదని తెలిపారు. ఇటీవలనే బెల్లంపల్లి వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో దుర్గం సౌజన్య (26), డాటర్ ఆఫ్ దామోదర్, అనే మహిళ అదృశ్యమైనట్లు కేసు నమోదు అయిందన్నారు. దీంతో బెల్లంపల్లి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ రాకేష్‌కు సమాచారం అందించగా ఆమె దుర్గం సౌజన్యగా గుర్తాంచారు. ఆమె సోదరుడు దుర్గం అజయ్, కుటుంబ సభ్యులను కాజీపేట జీఆర్పీ స్టేషన్‌కు పిలిపించి అప్పజెప్పామన్నారు.