కాజీపేట, డిసెంబర్ 28 : ఉత్తర, దక్షిణ భారతానికి ముఖ ద్వారంగా విరాజిల్లుతున్న కాజీపేట రైల్వే జంక్షన్ పరిధిలో భారీ రైల్వే మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ పీవోహెచ్(పిరియాడికల్ ఓవరాలింగ్) ప్రాజెక్టు నిర్మాణానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. మూడేళ్ల క్రితమే నిర్మాణానికి ప్రతిపాదనలు రాగా ముందుకు సాగలేదు. మూణ్ణెళ్ల కింద రైల్వే శాఖ రూ. 908 కోట్లు మంజూరు చేసింది. వివిధ చోట్ల భూమి సర్వే చేసిన అధికారులు చివరకు నష్కల్-పెండ్యాల మధ్య స్థలం ఖరారయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తున్నది.
రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద రైల్వే జంక్షన్ కాజీపేట శివారులో మరో భారీ రైల్వే మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ పీవోహెచ్, ఆర్వోహెచ్ ప్రాజెక్టు నిర్మించేందుకు రైల్వేశాఖ శ్రీకారం చుట్టింది. రూ. 908 కోట్ల వ్యయంతో 300 ఎకరాల్లో ఏర్పాటు చేయనుంది. మూడేళ్ల క్రితమే రైల్వే పీవో హెచ్ (పిరియాడికల్ ఓవరాలింగ్) వర్క్‌షాపు మంజూరైనప్పటికీ ఏర్పాటు కార్యరూపం దాల్చలేదు. మూడు నెలల క్రితం రైల్వేశాఖ రూ. 908 కోట్ల నిధులు మంజూరు చేసింది. రైళ్ల రద్దీ, గూడ్స్ రైళ్ల రవాణా, ప్రయాణికుల ట్రాఫిక్‌కు అధిగమించేందుకు రవాణా, పాలనా సౌలభ్యం, లాభా లు, సమయాన్ని దృష్టిలో పెట్టుకొని అన్నింటిని ఒకే దగ్గర ఉండేలా భావించిన రైల్వే శాఖ రైల్వే మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ పీవోహెచ్ డిపోను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించింది.
కాజీపేట రైల్వే జంక్షన్ అభివృద్ధి, డీజిల్, ఎలక్ట్రికల్ లోకోషెడ్లను కలపడం, రైల్వే వ్యాగన్ ఆర్వోహెచ్, పీవోహెచ్, సిక్లైన్, మరమ్మతు చేసి తిరిగి తయారైన వ్యాగన్లను ఎగ్జామినేషన్ చేసేలా అన్నింటిని ఒకే చోట ఉండేలా ఏర్పాటు చేస్తున్నారు. ఇటీవల రైల్వే జోన్, డివిజన్‌స్థాయి అధికారులు అన్ని వసతులను దృష్టిలో పెట్టుకుని పలు దఫాలుగా కాజీపేట జంక్షన్-స్టేషన్ ఘన్పూర్ రైల్వే స్టేషన్ల మధ్య మూడు చోట్ల స్థలాలను పరిశీలించారు. నష్కల్-పెండ్యాల, కాజీపేట రైల్వే స్టేషన్ల మధ్య రెండు ప్రాంతాల్లో అనువుగా ఉన్నట్లు రైల్వేబోర్డుకు, కలెక్టర్‌కు ప్రతిపాదనలను పంపించినట్లు అధికారులు చెబుతున్నారు.
డీజిల్ రైలింజన్లను ఎత్తివేసి, ఎలక్ట్రికల్ రైలింజన్లను అందుబాటులోకి తీసుకొస్తున్నది. డీజిల్ లోకోషెడ్డులో 21 ఇంజిన్లు మాత్రమే ఉండగా, కార్మికులు మాత్రం 95కు పైగా ఉన్న ఎలక్ట్రికల్ ఇంజిన్లు మరమ్మతులు చేస్తున్నారు. నూతనంగా ఏర్పాటు చేస్తున్న రైల్వే మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్‌కు డీజిల్ లోకోషెడ్డు, కాజీపేట రైల్వే స్టేషన్ అదనపు ప్లాట్‌ఫారాల ఏర్పాటుకు ఎలక్ట్రికల్ లోకోషెడ్డు అడ్డుగా మారుతున్నది. అన్నింటిని దృష్టిలో పెట్టుకున్న రైల్వేశాఖ భవిష్యత్‌లో ఈఎల్ఎస్, డీఎల్ఎస్ షెడ్డులను ఎత్తివేసి మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ పీవోహెచ్ ప్రాజెక్టులోకి మార్చ నున్నట్లు రైల్వే అధికారులు చెబుతున్నారు. దీంతో కాజీపేట రైల్వే స్టేషన్ అదనపు ప్లాట్ఫారాలతో కళకళలాడనుంది. ఈ ప్రాజెక్టు ఏర్పాటుతో ఎలాంటి నూతన ఉద్యోగాలు, ఉపాధికి అవకా శాలు ఉండవంటున్నారు.