హనుమకొండ చౌరస్తా, జూన్ 8 : కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ప్రైవేట్ డిగ్రీ, పీజీ కాలేజీలు వ్యాపార కేంద్రాలుగా మారిపోతున్నాయి. ప్రభుత్వ పర్యవేక్షణ లోపం, ఉన్నతాధికారుల తనిఖీలు లేకపోవడంతో ధనార్జనే ధ్యేయంగా యాజమాన్యాలు కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. నిబంధనలు పాటించకుండా అక్రమ మార్గంలో సంపాదనే లక్ష్యంగా ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు ఏర్పాటవుతున్నాయి.
ప్రభుత్వం నిర్ణయించిన మేరకు కాకుండా ఇష్టారీతిన ఫీజుల దోపిడీకి పాల్పడుతూ అడ్మిషన్లు చేపట్టడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తమను ఎవరేం చేయలేరనే ధీమాతో కొందరు నిర్వాహకులు నిబంధనలను తుంగలో తొకుతూ విద్యార్థుల భవిష్యత్‌ను ఫణంగా పెడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మామూళ్ల మత్తులో మునిగి తేలుతున్న యూనివర్సిటీ అధికారులు ఏనాడు కాలేజీలను తనిఖీ చేసి చర్యలు తీసుకోలేదని విద్యార్థులు వాపోతున్నారు. ముఖ్యంగా నగరంలోని కిషన్‌పుర, నయీంనగర్, బీమారం పరిసర ప్రాంతాల్లో వెలుస్తున్న కొన్ని కాలేజీలు నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నా అధికారులు చూడీచూడనట్లు వ్యవహరిస్తున్నారని విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
డిమాండ్ ఉన్న కోర్సుల్లో సీట్ల కోసం అనధికారికంగా భారీ మొత్తంలో డొనేషన్లు, ట్యూషన్, డెవలప్మెంట్ ఫీజుల పేరిట వేల రూపాయలు వసూలు చేస్తున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. కోర్సు మధ్యలో కాలేజీ మారాలన్నా లేదా ఫీజు బకాయిలు ఉన్నా విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లను వెనక్కి ఇవ్వకుండా వేధిస్తున్నారు. పరీక్ష, ల్యాబ్ ఫీజులు, రికార్డు పుస్తకాలు, కాలేజీ ఐడీ కార్డుల పేరుతో భారీగా డబ్బులు లాగడం గమనార్హం.
గ్రామీణ ప్రాంత విద్యార్థులే లక్ష్యంగా ఈ కాలేజీలు కొత్త దందాను సాగిస్తున్నాయి. పీఆర్వోలను నియమించుకొని సాలర్షిప్ వస్తుందని..ఉచిత విద్య అందిస్తామని.. ఫీజులు కట్టనకర్లేదంటూ ఆశ చూపి అడ్మిషన్లు తీసుకుంటున్నారు. తీరా కళాశాలలో చేరాక ఒకో విద్యార్థి నుంచి రూ.30 వేల వరకు అదనపు ఫీజుల పేరిట వసూలు చేస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతున్నది. డబ్బులిచ్చిన విద్యార్థులకు పరీక్షా కేంద్రాల్లో ప్రత్యేక గదులు కేటాయించి, నేరుగా సమాధానాలు చేరవేస్తున్నారనే ఆరోపణలున్నాయి.

కొందరు ప్రిన్సిపాల్స్ స్వయంగా మాస్ కాపీయింగ్‌ను పర్యవేక్షిస్తున్నారని, దీనిపై గతంలో అధికారులకు ఫిర్యాదులు వచ్చినా ‘మామూలు’గా తీసుకున్నారని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. అధికారుల అండదండలతోనే ఈ వ్యవహారం నడుస్తున్నదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంత జరుగుతున్నా యూనివర్సిటీ అధికారులు పట్టించుకోవడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. విద్యను వ్యాపారంగా మలిచి, పరీక్షల్లో అక్రమాలకు పాల్పడుతున్న, నిబంధనలు పాటించని కళాశాలలను గుర్తించి వాటి గుర్తింపును రద్దు చేయాలని కోరుతున్నారు.
ప్రైవేట్ డిగ్రీ, పీజీ కాలేజీల్లో మౌలిక వసతులు కరువయ్యాయి. కళాశాలల యాజమాన్యాలు విద్యా ప్రమాణాలను తుంగలో తొక్కుతున్నాయి. తక్కువ జీతాలకే పనిచేసే వారిని, నెట్, సెట్ లేదా పీహెచ్డీ లేని తాత్కాలిక అధ్యాపకులతో బోధన సాగిస్తున్నారు. సైన్స్, కంప్యూటర్ కోర్సులకు అవసరమైన ల్యాబొరేటరీలు, కంప్యూటర్లు, ఇంటర్నెట్ సౌకర్యం కల్పించడం లేదు. కనీస ఆట, పార్కింగ్ స్థలం లేని ఇరుకైన అపార్ట్మెంట్లు, వాణిజ్య సముదాయాల్లోని రెండు లేదా మూడో అంతస్తుల్లో కాలేజీలు నిర్వహిస్తున్నారు. కనీస భద్రతా ప్రమాణాలు లేని భవనాలకు యూనివర్సిటీ అధికారులు ఏ ప్రాతిపాదికన అనుమతులిస్తున్నారో అర్థం కావడం లేదని విద్యావేత్తలు ప్రశ్నిస్తున్నారు.